ముంబై: ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు అందించే దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం ఒక కీలక విధానాన్ని ప్రకటించింది. బ్యాంకులు–బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా ‘కో–లెండింగ్ నమూనా (సీఎల్‌ఎం) పథకాన్ని ఆవిష్కరించింది.
విధివిధానాలు ఇలా...
సహ–రుణాలను అందించడానికి ఆయా బ్యాంకులు–ఎన్‌బీఎఫ్‌సీ మధ్య ఒక ముందస్తు అవగాహన ఉండాలి. రుణాలకు సంబంధించి లాభ–నష్టాలను వాటి వాటి వాటాల ఆధారంగా బ్యాంకులు–ఎన్‌బీఎఫ్‌సీ పంచుకుంటాయి. కో–లెండింగ్ విషయంలో ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం, రుణ గ్రహీతతో ఎన్‌బీఎఫ్‌సీ ఒక స్పష్టమైన అవగాహన కుదుర్చుకోవాలి. ఒప్పంద స్వభావం స్పష్టంగా ఉండాలి. రుణ ఒప్పందంలో బ్యాంకులు–ఎన్‌బీఎఫ్‌సీల పాత్ర, బాధ్యతలు సవివరంగా ఉండేలా చూడాలి.
అటు బ్యాంకులకు ఇటు ఎన్‌బీఎఫ్‌సీలు రెండింటికీ వర్తించే నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా, పరస్పర అవగాహనా పూర్వక వడ్డీరేటును రుణగ్రహీత నుంచి వసూలు చేయాలి. బ్యాంకులతో కలిసి నిర్వహించే ఒక ఎస్క్రో ఖాతా ద్వారా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య అన్ని లావాదేవీలు (పంపిణీలు, పునఃచెల్లింపులు) జరగాలి. ఫిర్యాదుల పరిష్కారానికి వస్తే, రుణగ్రహీత ఎన్‌బీఎఫ్‌సీలో నమోదు చేసిన ఏదైనా ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఇందుకు సహ–రుణదాతలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక వేళ ఈ స్థాయిలో ఫిర్యాదు పరిష్కారం జరక్కపోతే, సమస్యను రుణ గ్రహీత సంబంధిత బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ లేదా ఎన్‌బీఎఫ్‌సీకి సంబంధించి అంబుడ్స్‌మెన్ లేదా ఆర్‌బీఐలోని కస్టమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ప్రాధాన్యతా రంగాలంటే..: సమాజంలో బలహీన వర్గాలు, వ్యవసాయం, లఘు మధ్య చిన్న తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు, సామాజిక మౌలిక వసతులు వంటి వాటిని ప్రాధాన్యతా రంగాలుగా పరిగణిస్తారు. దేశాభివృద్ధి లో ఆయా వర్గాలు, విభాగాలకు కీలక పాత్ర ఉంటుంది. ఈ రంగాలకు తగిన రుణ సౌలభ్యత సకాలంలో కలగాలి. ఈ దిశలో బ్యాంకులు తమ వార్షిక రుణాల్లో 40 శాతాన్ని తప్పనిసరిగా ప్రాధాన్యతా రంగాలకు మంజూరు చేయాల్సి ఉం టుంది. సాధ్యమైనంత తక్కువ వడ్డీరేటుకు అందించాలి.
ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు
Published Fri, Nov 6 2020 6:19 AM | Last Updated on Fri, Nov 6 2020 6:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment