ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌.. | Nirmala Sitharaman attends CII National Council Meeting | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌..

Published Sat, Aug 10 2019 5:00 AM | Last Updated on Sat, Aug 10 2019 5:30 AM

Nirmala Sitharaman attends CII National Council Meeting - Sakshi

సీఐఐ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు

న్యూఢిల్లీ: మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసానిచ్చారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఆమె చెప్పారు.  శుక్రవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘ఎకానమీకి ఊతమిచ్చే చర్యలు తీసుకునే విషయంలో రిజర్వ్‌ బ్యాంక్, ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో ఉన్నాయి‘ అని ఆమె తెలిపారు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందన్నారు.

పరిశ్రమ వర్గాలకు పరిస్థితులను కఠినతరం చేయాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సూచనగా నిలిచే కీలక రంగాల వృద్ధి గణాంకాలు, ఆటోమొబైల్‌ తదితర రంగాల పనితీరు నానాటికి దిగజారుతుండటంతో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం (ఎన్‌బీఎఫ్‌సీ) పలు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నామని, రాబోయే వారాల్లో పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కాస్త మందగించినా భారత్‌ .. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఈ సందర్భంగా  సీతారామన్‌ చెప్పారు.  

సీఎస్‌ఆర్‌పై భరోసా..
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు పెట్టాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఆదాయ పన్ను శాఖపరమైన వేధింపుల ఆరోపణల గురించి తెలుసుకునేందుకు వచ్చే వారం నుంచి పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆమె వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు కూడా తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వివరించారు. 

అప్పటికప్పుడు పన్ను అధికారులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. పన్నులపరమైన వేధింపు ఉదంతాలను స్వయంగా తానే పరిశీలించేందుకు వీలుగా టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇక కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించాలని ప్రభుత్వానికి కూడా ఉందని, అయితే.. కార్పొరేట్లు ఇందుకోసం కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని ఆమె వివరించారు. మరోవైపు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి కార్పొరేట్లు, సరఫరాదారులకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు రావాల్సిన బకాయిలు ఏకంగా రూ. 48,000 కోట్ల మేర ఉంటాయని అంచనా.   

పన్ను ఊరట కల్పించండి: ఎఫ్‌పీఐల వినతి
అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్‌చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్‌ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అదనపు సర్‌చార్జీ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్‌మన్‌ శాక్స్, నొమురా, బ్లాక్‌రాక్, సీఎల్‌ఎస్‌ఏ, బార్‌క్లేస్, జేపీ మోర్గాన్‌ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్‌పీఐల అభిప్రాయాలను మంత్రి సావధానంగా విన్నారని.. అయితే ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రూ. 2 కోట్ల పైగా ఆదాయం ఉన్న వారికి వర్తించే పన్నులతో పాటు అదనపు సర్‌చార్జీ కూడా విధించాలని బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనతో ఆందోళన చెందుతున్న ఎఫ్‌పీఐలు స్టాక్‌మార్కెట్లలో భారీగా విక్రయాలు జరపడం, మార్కెట్లు భారీగా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రితో ఎఫ్‌పీఐల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల అవసరాల కోసం ఎన్‌బీఎఫ్‌సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇతరత్రా సాధనాలూ పరిశీలించాలని, అలాగే ఈ రంగానికి కూడా నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందని ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement