పలువురి అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350 పాయింట్లు ఎగసి 38,013 కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 11,188 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్ మరోసారి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కోవిడ్-19 కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అవసరమైతే తగిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా పేర్కొన్నారు. దీంతో మార్కెట్లకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఆటో డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాలు 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. అయితే ఆటో, బ్యాంకింగ్ రంగాలు నామమాత్ర నష్టాలతో కదులుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, గెయిల్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సిప్లా, గ్రాసిమ్, హెచ్‌యూఎల్ 3.3-1.4 శాతం మధ్య బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐషర్, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ 1-0.5 శాతం మధ్య డీలా పడ్డాయి.
ఫార్మా జోరు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో టాటా కన్జూమర్, నిట్ టెక్, ఆర్‌ఈసీ, అపోలో హాస్పిటల్స్, అరబిందో, టొరంట్ ఫార్మా, గ్లెన్‌మార్క్, దివీస్ 5.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బాటా, ఎస్కార్ట్స్, భెల్, మ్యాక్స్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఐజీఎల్, ఇండిగో, పేజ్, ఎంజీఎల్, నౌకరీ 3.7-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1459 లాభపడగా.. 910 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment