
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ ఊరటనిచ్చింది.డిజిటల్ 2.0 ప్రోగ్రామ్ కింద ప్లాన్ చేసిన వ్యాపార కార్యకలాపాలపై విధించిన ఆంక్షలను మార్చి 11న ఆర్బీఐ ఎత్తివేసింది. ఈ విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ పేర్కొంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన డిజిటల్ 2.0కు సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో తరచుగా అవాంతరాలు తల్లెత్తాయి. దీనిని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. 2020 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ 2.0 కార్యక్రమం కింద తలపెట్టిన లావాదేవీలపై ఆంక్షలు విధించింది.దాంతో పాటుడా కొత్తగా క్రెడిట్ కార్డులను ఎవరికీ జారీ చేయకుండా నిషేధం విధించింది. గతేడాది ఆగస్టులో కాస్త ఊరటనిస్తూ క్రెడిట్ కార్డుల జారీకి అనుమతిచ్చింది.
ఆర్బీఐ సిఫార్సులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి స్వల్ప, మధ్యస్థ,దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి ఈ ఆంక్షల సమయం ఉపయోగపడిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది.సులభమైన, అత్యున్నత సర్సీసులను తమ ఖాతాదారులకు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.
చదవండి: హాట్‌కేకుల్లా బుక్కైన కియా నయా కార్..! ఏకంగా 50 వేలకు పైగా..కేవలం..