ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆమోదనీయంకాని అధిక స్థాయిలో ఉందని ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) కట్టడికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు పెంచక తప్పదని ప్రతిపాదించారు. దీనికి గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఆగస్టు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన పాలసీ భేటీకి సంబంధించి శుక్రవారం వెడుదలైన మినిట్స్ ఈ వివరాలను తెలిపాయి. దీని ప్రకారం...
► ఆర్‌బీఐ గవర్నర్ వ్యక్తం చేసిన అభిప్రాయానికి మిగిలిన సభ్యులూ అంగీకరించారు. దీనితో రెపో రేటు 4.9 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది.
► విధాన చర్యల క్రమం, ద్రవ్య విధాన విశ్వసనీయతను బలోపేతం చేస్తుందని, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, ఎకానమీ క్రియాశీలత పురోగతి ధ్యేయంగా ఆర్‌బీఐ చర్యలు కొనసాగుతాయని గవర్నర్ ఈ భేటీలో పేర్కొన్నారు.
► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా పాలసీ అంచనా వేసింది. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ అంచనావేసింది.
► ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4 శాతం, 5.8 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది.. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది.
పెంపు దిశగా తప్పని అడుగులు
కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచే (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం ) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్‌బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది.
జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 5వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రస్తుతం ఈ రేటు 5.4 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలను షురూ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6 నుంచి 6.5 శాతం శ్రేణికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో 7.79 గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం అటు తర్వాతి మూడు నెలల్లో వరుసగా తగ్గుతూ రావడం కొంత హర్షణీయ పరిణామం.
చదవండి: నాన్–రెసిడెంట్ కార్పొరేట్లకు ఊరట.. దానిపై పన్ను భారం తగ్గింది!
Comments
Please login to add a commentAdd a comment