వచ్చే 18నెలలూ వడ్డీరేట్లు యథాతథం!
వచ్చే 18నెలలూ వడ్డీరేట్లు యథాతథం!
Published Thu, Apr 20 2017 12:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
న్యూఢిల్లీ : వడ్డీరేట్లపై ఆశలు పెంచుకుంటున్న మార్కెట్ వర్గాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిరాశపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పడికప్పుటి ద్వైపాక్షిక సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటులో ఎటువంటి మార్పు చేపట్టలేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసాగించనుందట. వచ్చే ఏడాది వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
35 మందికి పైగా ఆర్థికవేత్తలపై ఏప్రిల్ 10-19 మధ్య జరిపిన పోల్లో ఈ విషయం వెల్లడైంది. 2018 నాలుగో త్రైమాసికం వరకు ఆర్బీఐ రెపోరేటును 6.25 శాతంగానే ఉంచనున్నట్టు తెలిసింది. అంతేకాక రివర్స్ రెపో రేటు 6.00 శాతంగా ఉండనున్నట్టు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అనేది రిజర్వు బ్యాంకు అతిపెద్ద ఆందోళనకరమైన అంశంగా మారిందని, ప్రస్తుతం సులభతరమైన ద్రవ్యవిధానాన్ని ఇది హరిస్తుందని క్రిసిల్కు చెందిన ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి చెప్పారు.
గత నెల వార్షిక వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పెరిగిందని, 2016 అక్టోబర్ నుంచి ఈ నెలలోనే చాలా వేగవంతంగా పెరిగిందని పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దగ్గరగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5 శాతానికి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో వడ్డీరేట్ల కోత అంచనాలను వారు తగ్గిస్తున్నారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని పేర్కొంటున్నారు.
Advertisement