బ్యాంకులకు ‘మాస్టర్‌’ షాక్‌.. | RBI move to ban Mastercard from issuing new cards may hit 5 private banks | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు ‘మాస్టర్‌’ షాక్‌..

Published Sat, Jul 17 2021 3:20 AM | Last Updated on Sat, Jul 17 2021 3:20 AM

RBI move to ban Mastercard from issuing new cards may hit 5 private banks - Sakshi

న్యూఢిల్లీ: స్థానిక డేటా స్టోరేజీ నిబంధనలు పాటించనందుకు గాను పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటింగ్‌ సంస్థ మాస్టర్‌కార్డుపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధం విధించడం.. ఇతర బ్యాంకులకు సంకటంగా మారింది. మాస్టర్‌కార్డ్‌తో ఒప్పందం ఉన్న 5 ప్రైవేట్‌ బ్యాంకులు కొత్తగా కార్డులు జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. యాక్సిస్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులు సమస్యలు ఎదుర్కోనున్నాయి. అటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపైనా దీని ప్రభావం పడనుంది.

తరచూ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నందున  కొత్త కార్డులు (డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్‌) జారీ చేయకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇప్పటికే  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు ఎదుర్కొంటోంది. మరోవైపు, బ్యాంకులతో పాటు బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ కార్డు వంటి సంస్థలు కూడా సమస్యలు ఎదుర్కోనున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా నివేదిక ప్రకారం .. మాస్టర్‌కార్డ్‌పై ఎక్కువగా ఆధారపడిన ఏడు సంస్థలు కొత్త కార్డులను జారీ చేయలేకపోవచ్చు. ఇతర పేమెంట్‌ గేట్‌వేలతో ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త కార్డులు జారీ చేయడానికి కనీసం 2–3 నెలలు పట్టేస్తుందని అంచనా. టెక్నాలజీని అనుసంధానం చేసుకోవాల్సి రానుండటం తదితర అంశాలు ఇందుకు కారణం.

మూడింటిపై ఎక్కువ ప్రభావం..
ఆర్‌బీఎల్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ప్రధానంగా కార్డుల జారీ కోసం      మాస్టర్‌కార్డ్‌పైనే ఆధారపడటం వల్ల వాటిపై మరింత తీవ్ర ప్రభావం పడనుంది. ‘కో–బ్రాండ్‌ భాగస్వాములు సహా క్రెడిట్‌ కార్డుల సంస్థల్లో   ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యస్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే వీటి కార్డ్‌ స్కీములన్నీ కూడా మాస్టర్‌కార్డ్‌తోనే ముడిపడి ఉన్నాయి‘ అని నొమురా నివేదికలో తెలిపింది. దీని ప్రకారం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంకులు జారీ చేసే కార్డుల్లో 35–40 శాతం మాస్టర్‌కార్డ్‌వి ఉంటున్నాయి. అటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో భాగమైన క్రెడిట్‌ కార్డ్‌ విభాగం ఎస్‌బీఐ కార్డ్‌ జారీ చేసేవాటిల్లో 10 శాతం మాస్టర్‌కార్డ్‌వి ఉంటున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంకు పూర్తిగా వీసాకి అనుసంధానమైనది కావడంతో దానిపై ప్రభావమేమీ ఉండదు.  

వీసాతో ఆర్‌బీఎల్‌ ఒప్పందం..
తాజా పరిణామాల నేపథ్యంలో వీసా ప్లాట్‌ఫాంపై క్రెడిట్‌ కార్డులు జారీ చేసేందుకు వీసా వరల్డ్‌వైడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంకు తెలిపింది. టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు 8–10 వారాలు పట్టొచ్చని, తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్స్‌ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో కో–బ్రాండెడ్‌ కార్డుల స్కీములు కూడా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement