
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారితో గృహ కొనుగోలుదారుల అభిరుచుల మార్పులు వచ్చాయి. గతంలో ఇళ్లు కొనాలంటే ఆఫీస్‌కు ఎంత దూరముంది? స్కూల్‌కు దగ్గర్లో ఉందా? అనేవే ప్రధాన ఎంపికలుగా భావించేవాళ్లు. కానీ, ఇప్పుడు నివాస ప్రాంతాలు పర్యావరణహితంగా ఉన్నాయా? దగ్గర్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలున్నాయా? అనేవి చూస్తున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా బయ్యర్ సర్వే–2021 తెలిపింది.
నగరంలో భవిష్యత్తులో గృహ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనది గ్రీనరీ అంశమేనని 97 శాతం మంది అభిప్రాయపడ్డారు. 91 శాతం మంది పరిసర ప్రాంతాలలో హెల్త్‌కేర్, 78 శాతం మంది పని కేంద్రాలకు దగ్గర్లో గృహాలు ఉండటం ప్రధాన అంశాలని తెలిపారు. 29 శాతం మంది రిటైల్, కల్చరల్ సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు వంటి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు, 26 శాతం విద్యా సంస్థలకు, 17 శాతం మంది ఓపెన్ ఏరియాలు, లేక్స్ వంటి మంచి వ్యూ ఉన్న ప్రాంతాలలో గృహాల కొనుగోలు నిర్ణయం ఉంటుందని వివరించారు.
హైదరాబాద్‌లో 80 శాతం గృహ యజమానులు వచ్చే 12 నెలల్లో ఇళ్ల ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 8 శాతం మంది 1–9 శాతం వరకు, 2 శాతం మంది 10–19 శాతం మేర ధరలు క్షీణిస్తాయని అంచనా వేస్తుండగా.. 57 శాతం మంది మాత్రం 10–19 శాతం, 3 శాతం మంది 20 శాతం పైన, 20 శాతం మంది 1–9 శాతం వరకు పెరుగుతాయని భావిస్తున్నారు.
భవిష్యత్తులో గృహ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనది తమ కుటుంబ పరిమాణం పెరగడమేనని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. 22 శాతం మంది హోమ్ అప్‌గ్రేడ్, 12 శాతం మంది హాలీడే హోమ్ వంటి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని చెప్పారు.
కరోనా ప్రారంభమైన నాటి నుంచి 54 శాతం మంది తమ నివాసాన్ని మార్చాలని భావిస్తున్నారు. 58 శాతం మంది ఎక్కువగా ఓపెన్ స్పేస్ ఉన్న ప్రాంతంలోకి వెళ్లాలనుకుంటున్నారు. దాదాపు 55 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో రెండో ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment