న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గతేడాది(2020–21)లో వేతనాన్ని వొదులుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి దేశీయంగా అటు ఆర్థిక వ్యవస్థ, ఇటు బిజినెస్‌లను దెబ్బతీయడంతో స్వచ్ఛందంగా జీతాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆర్‌ఐఎల్ తాజా వార్షిక నివేదికలో తెలియజేసింది. వెరసి 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్‌ఐఎల్ చైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీ జీతాన్ని తీసుకోలేదని వెల్లడించింది. కాగా.. అంతక్రితం 11 ఏళ్లుగా ముకేశ్ రూ. 15 కోట్లు చొప్పున వార్షిక వేతనాన్ని ఆర్జిస్తున్నట్లు ప్రస్తావించింది.
10% వాటా: గతేడాది అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్ రూ. 1,53,818 కోట్ల ఆదాయం సాధించినట్లు ఆర్‌ఐఎల్ వార్షిక నివేదిక వెల్లడించింది. పన్నుకు ముందు లాభం రూ. 9,842 కోట్లను తాకినట్లు తెలియజేసింది. కాగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ కామర్స్, మర్చంట్ భాగస్వామ్యాల ద్వారా ఆదాయంలో 10 శాతం వాటా సమకూరినట్లు వివరించింది. కోవిడ్–19 పరిస్థితులు ఇందుకు సహకరించగా.. అంతక్రితం ఏడాది(2019–20)లో ఈ విభాగం వాటా జీరోగా ప్రస్తావించింది.
మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలు తదితర ప్రతికూల పరిస్థితులు ఆన్‌లైన్ చానల్ జోరుకు దోహదపడినట్లు తెలియజేసింది. ఆన్‌లైన్ చానల్ జోరు ఇకపైనా కొనసాగే వీలున్నట్లు అంచనా వేసింది. గతేడాది హైపర్‌లోకల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌ను రిలయన్స్ ఆవిష్కరించిన విషయం విదితమే. ఈ బాటలో ఆన్‌లైన్ బిజినెస్‌లుగల ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్, ఫర్నిచర్ రిటైలర్ అర్బన్ లాడర్, లింగరీ రిటైలర్ జైవేమ్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఈకామర్స్ బిజినెస్‌ను విస్తృతం చేసింది. అయితే ఫిజికల్ స్టోర్లు సైతం వృద్ధికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
Mukesh Ambani: జీతాన్ని వదులుకున్న ముకేశ్ అంబానీ
Published Fri, Jun 4 2021 1:38 AM | Last Updated on Fri, Jun 4 2021 8:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment