Reliance Industries Climbs 8 Spots To 45th Rank On Forbes' Global 2000 List, Details Inside - Sakshi
Sakshi News home page

Forbes Global List: రిలయన్స్‌ సత్తా.. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ కంపెనీలను సైతం వెనక్కి నెట్టి..

Published Wed, Jun 14 2023 6:55 AM | Last Updated on Wed, Jun 14 2023 9:18 AM

Reliance Industries Climbs 8 Spots On Forbes' Global 2000 List - Sakshi

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా భారీ అంతర్జాతీయ సంస్థల జాబితాలో మరింత పై స్థానానికి చేరింది. 2023 సంవత్సరానికి గాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందించిన గ్లోబల్‌ 2000 కంపెనీల లిస్టులో 8 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు దక్కించుకుంది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూప్, స్విట్జర్లాండ్‌ దిగ్గజం నెస్లే, చైనా సంస్థ ఆలీబాబా గ్రూప్‌ మొదలైన వాటిని కూడా అధిగమించింది.

109.43 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 8.3 బిలియన్‌ డాలర్ల లాభాలు నమోదు చేయడంతో రిలయన్స్‌ ర్యాంకు మెరుగుపడింది. టాప్‌ 100 జాబితాలో రిలయన్స్‌తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 77వ స్థానంలో నిల్చింది. 2000 కంపెనీల లిస్టులో మొత్తం మీద 55 భారతీయ సంస్థలు.. ర్యాంకులను దక్కించుకున్నాయి.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలతో దెబ్బతిన్నప్పటికీ అదానీ గ్రూప్‌నకు చెందిన 3 సంస్థలు లిస్టులో నిల్చాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (1,062), అదానీ పవర్‌ (1,488), అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ (1,598 ర్యాంకు) వీటిలో ఉన్నాయి. అమ్మకాలు, లాభాలు, అసెట్‌లు, మార్కెట్‌ విలువ అంశాల ప్రాతిపదికన ఫోర్బ్స్‌ ఈ ర్యాంకులు ఇచ్చింది.  

జేపీమోర్గాన్‌ టాప్‌.. 
ఫోర్బ్స్‌ లిస్టులో 3.7 లక్షల కోట్ల డాలర్ల అసెట్స్‌తో  జేపీమోర్గాన్‌ అగ్రస్థానం దక్కించుకుంది. సౌదీ చమురు సంస్థ ఆరామ్‌కో 2వ స్థానంలో, చైనాకు చెందిన మూడు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది టాప్‌ ర్యాంకులో ఉన్న బెర్క్‌షైర్‌ హాథ్‌వే ఈసారి 338వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నష్టా ల్లో ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది మే 5 నాటికి అందుబాటులో ఉన్న గత 12 నెలల గణాంకాల ప్రకారం ఫోర్బ్స్‌ ఈ లిస్టును రూపొందించింది.

జాబితాలోని కంపెనీల మొత్తం విక్రయాలు 50.8 లక్షల కోట్ల డాలర్లుగా, లాభాలు 4.4 లక్షల కోట్ల డాలర్లుగా, అసెట్స్‌ 231 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయి. 58 దేశాలకు చెందిన లిస్టెడ్‌ కంపెనీలకు చోటు దక్కింది. 611 కంపెనీలతో అమెరి కా అగ్రస్థానంలో ఉండగా 346 సంస్థలతో చైనా రెండో స్థానంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement