సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం రిలయన్స్ ఆర్ఎస్‌ఏయూఎల్ (RSOUL) లిమిటెడ్ అనే కొత్త యూనిట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో ప్రకటించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్‌ఈ ఫైలింగ్ ప్రకారం, రిలయన్స్ సోయు లిమిటెడ్ (Reliance SOU Ltd ) అనే పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దూకుడుగా వస్తోంది. ఈ సంస్థలో (ఆర్‌ఎస్‌ఓఎల్ ఈక్విటీ షేర్లలో) రూ. ఒక లక్ష ప్రారంభ మూలధనాన్ని పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది.
అయితే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ రంగంలో రిలయన్స్‌ది ఇదే మొదటి అడుగు కాదు. 2019లో, ముంబై వ్యాపార కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో 65శాతం వాటాను రూ.1,105 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తరువాత, ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం రిలయన్స్ నవీ ముంబై ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ను స్థాపించింది. జియో వరల్డ్ గార్డెన్ బాంద్రా కుర్లాలోని జియో వరల్డ్ సెంటర్ వంటి ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అలాగే గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 8,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ అనుబంధ సంస్థ, మోడల్ ఎకనామిక్ టౌన్‌షిప్ లిమిటెడ్ (METL), ప్రస్తుతం హర్యానాలోని ఝజ్జర్‌లో సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. తాజా నిర్ణయంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ ప్రాపర్టీస్, టాటా రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, షాపూర్జీ పల్లోంజీ అండ్ కో వంటి దిగ్గజాలతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment