
విజయవాడ: రాష్ట్రంలో 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభించేందుకు జియో సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో తన నెట్వర్క్ పై దృష్టి పెట్టింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రధాన పట్టణాల్లో జియో తన 4జీ నెట్వర్క్ ను 5జీ నెట్వర్క్ గా అప్డేట్ చేసి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా పట్టణాలకు కూడా 5జీ సేవలను విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలను రూపొందించింది.
దసరా రోజున ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, వారణాసి పట్టణాల్లో జియో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 'జియో వెల్కమ్ ఆఫర్' పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక ఆఫర్ కింద వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందించనున్నట్లు జియో ప్రకటించింది. ‘జియో ట్రూ 5జీ’ సేవలు పొందేందుకు కస్టమర్లు సిమ్ కార్డు, 5జీ మొబైల్ మార్చాల్సిన అవసరం లేదని, కస్టమర్లకు ఆటోమేటిగ్గా సర్వీస్ అప్‌గ్రేడ్ అవుతుందని జియో చెప్పింది. 5జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, అన్ని రకాల వారికి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం జియోకు 42.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. తాము ప్రారంభించనున్న 5జీ సేవల ద్వారా దేశంలో హెల్త్ కేర్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి అనేక రంగాలు మరింత ప్రగతి సాధిస్తాయని జియో విశ్వసిస్తోంది.
5జీ వేగంలోనూ జియో టాప్!
4జీ సేవలను అందించటంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్న జియో 5జీ వేగంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసింది. దీని ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment