ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, టెక్ దిగ్గజం గూగుల్ కలిసి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ ను తీసుకొనిరాబోతున్న సంగతి తెలిసిందే. జియో తన యూజర్ల కోసం చౌకైన ధరకే 4జీ స్మార్ట్ ఫోన్ తీసుకు రావాలని యోచిస్తుంది. కేవలం రూ.4 వేలకే జియో 4G స్మార్ట్ ఫోన్ అందించాలని రిలయన్స్ జియో కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా దీనిని అమ్మకానికి తీసుకురానుంది. అయితే, విడుదలకు ముందు దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ప్రైస్ అంతర్జాలంలో లీక్ అయ్యాయి.
జియోఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) సహాయంతో పనిచేస్తుంది. ఇది హెచ్ డీ+ డిస్ ప్లేతో పాటు సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని లాంచ్ సమయంలో చెప్పారు. 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జియోఫోన్ నెక్ట్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్ అవుతుందని తెలిపారు.జియోఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్లను ఎక్స్ డిఎ డెవలపర్స్ లో ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన మిషాల్ రెహమాన్ ట్విట్టర్ లో పంచుకున్నారు.
రెహమాన్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 720ఎక్స్1,440 పిక్సెల్స్ డిస్ ప్లేను కలిగి ఉండనుంది. క్వాల్కామ్ క్యూఎమ్215 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 64-బిట్ క్వాడ్-కోర్ మొబైల్ ప్రాసెసర్, క్వాల్కామ్ అడ్రెనో 308 జీపీయుతో రానుంది. ఇందులో బ్లూటూత్ వి4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్ పిడీడీఆర్3 ర్యామ్, ఈఎమ్ఎమ్ సీ 4.5 స్టోరేజీకి మద్దతుతో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ఎక్స్5ఎల్ టిఈ మోడెంతో వస్తుంది. జియోఫోన్ నెక్ట్స్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకువస్తున్నట్లు రెహమాన్ పేర్కొన్నారు. దీనిలో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇక ధర విషయానికి వస్తే కంపెనీ సబ్ $50(సుమారు రూ.4,000) ధరకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment