న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ గ్రూప్ ప్రధాన కంపెనీ ఆర్‌ఐఎల్ క్యూ1లో రూ. 17,955 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 12,273 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధి. చమురు, టెలికం బిజినెస్‌లు ఇందుకు దోహదం చేశాయి. నిర్వహణ లాభం 46 శాతం ఎగసి రూ. 40,179 కోట్లయ్యింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 2,42,982 కోట్లను తాకింది. ప్రధానంగా పెట్రోకెమికల్ విభాగం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం సాధించింది. ఇది 57 శాతం అధికం.
గ్యాస్, రిటైల్ గుడ్..
చమురు, గ్యాస్ బిజినెస్ ఆదాయం 183 శాతం జంప్‌చేసి రూ. 3,625 కోట్లకు చేరింది. కేజీ డీ6లో 40.6 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ ఉత్పత్తయ్యింది. గత క్యూ1లో ఇది 33.1 బీసీఎఫ్‌గా నమోదైంది. ఒక్కో ఎంబీటీయూకి 9.72 డాలర్లు చొప్పున లభించింది. గతంలో ఇది 3.62 డాలర్లు మాత్రమే. ఇక రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 54 శాతం ఎగసి రూ. 51,582 కోట్లను తాకాయి. నిర్వహణా లాభం 180 శాతం పురోగమించి రూ. 3,897 కోట్లకు చేరింది. మార్జిన్లు 7.6 శాతానికి మెరుగుపడ్డాయి. నికర లాభం 114 శాతం వృద్ధితో రూ. 2,061 కోట్లయ్యింది. కొత్తగా 792 స్టోర్లు తెరిచింది. వీటి మొత్తం సంఖ్య 15,866కు చేరాయి. కంపెనీ ప్రధానంగా ఓటూసీ, రిటైల్, ఈకామర్స్, టెలికంతోపాటు న్యూ ఎనర్జీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 30కల్లా నగదు(రూ. 2,05,727 కోట్లు) కంటే రుణాలు(రూ. 2,63,382 కోట్లు) అధికంకావడం గమనార్హం!
ఫలితాల నేపథ్యంలో ఆర్‌ఐఎల్ షేరు బీఎస్‌ఈలో 0.6 శాతం బలపడి రూ. 2,503 వద్ద ముగిసింది.
ఓటూసీ రికార్డ్...
అధిక ఇంధన ధరలు, రవాణా వ్యయాల నేపథ్యంలోనూ ఓటూసీ (ఆయిల్ టూ కెమికల్స్) బిజినెస్ రికార్డ్ పనితీరు చూపింది. ఈ విభాగం నిర్వహణా లాభం 63 శాతం దూసుకెళ్లి రూ. 19,888 కోట్లను తాకింది. రిటైల్ విభాగంలో కస్టమర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డిజిటల్ సర్వీసులు ఇందుకు వినియోగపడుతున్నాయి. దేశ ఇంధన భద్రతపై పెట్టుబడులు కొనసాగిస్తాం.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
రిలయన్స్ లాభం.. భళా
Published Sat, Jul 23 2022 1:06 AM | Last Updated on Sat, Jul 23 2022 1:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment