హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ రెనో.. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్‌ను తిరిగి ప్రవేశపెడుతోంది. వచ్చే ఏడాదికల్లా ఇక్కడి రోడ్లపై పరుగుతీసే అవకాశం ఉంది. 2012లో భారత్‌లో డస్టర్ అడుగుపెట్టింది. రెనో ఇండియా ఈ మోడల్ తయారీని 2022లో నిలిపివేసింది.
డస్టర్ పేరుతోనే రీఎంట్రీ ఇస్తుందని రెనో ఇండియా సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిల్లపల్లె వెల్లడించారు. కైగర్, ట్రైబర్, క్విడ్ ఫేస్ లిఫ్ట్ మోడళ్లను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు భద్రతా ఫీచర్లను జోడిస్తూ ఏ, ఏ ప్లస్ ప్యాసింజర్ కార్ల విభాగంలో పోటీపడతామని అన్నారు. కార్ల ధరలను పెంచలేదని, 2024 కోసం కొత్త శ్రేణిని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
మూడేళ్లలో అయిదు కొత్త మోడళ్లు..
వచ్చే మూడేళ్లలో భారత విపణిలో రెనో అయిదు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో రెండు బ్రాండ్ న్యూ ఎస్‌యూవీలు, ఒకటి ఎలక్ట్రిక్ వెహికిల్ ఉండనుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లలో ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తామని వెంట్రామ్ వెల్లడించారు. ‘ఒకసారి చార్జింగ్‌తో గరిష్టంగా 320 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది. భారత్ కోసం ఈవీని రూపొందిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్లకు ఈవీలను ఎగుమతి చేస్తాం. లిథియం నిల్వలు భారత్ చేతుల్లో ఉంటే బ్యాటరీల ధరలను నియంత్రించే ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో మార్కెట్లో అన్ని ధరల శ్రేణిలో ఎలక్ట్రిక్ కార్లు లభిస్తాయి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment