
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో మెరుగైన వృద్ధిని చూపించాయి. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 నవంబర్ నెలలోని గణంకాలతో పోలిస్తే 9 శాతం పెరిగినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఒకవేళ 2020 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే వృద్ధి 16 శాతంగా ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ భారతంలో 11 శాతంగా ఉంటే, తూర్పు, దక్షిణాదిన 9 శాతం చొప్పున, ఉత్తరాదిన 6 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదైనట్టు వివరించింది.
వ్యాపార వాతావరణం మెరుగైందని.. ఇది నిలదొక్కుకుంటుందని భావిస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్, కరోనా మూడో దశకు సంబంధించి ఆందోళనలు అయితే ఉన్నాయన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు నవంబర్‌లో 32 శాతం వృద్ధిని చూపించినట్టు రాయ్ తెలిపింది. క్రీడా ఉత్పత్తులు 18 శాతం అధిక అమ్మకాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అలాగే, ఆహారం, గ్రోసరీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల విభాగంలోనూ వృద్ధి నమోదు కాగా.. పాదరక్షలు, సౌందర్య, విలాస ఉత్పత్తులు, ఫర్నిచర్ విభాగాలు కోలుకుంట్నుట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment