‘‘ఓకే అని అంటివా ఓయోకి రమ్మంటడు'’.. అంటూ ఓ సినీ రచయిత హీరోయిన్‌తో పలికిస్తాడు. ఆఖరికి సినీరచనలను సైతం ప్రభావితం చేసేలా మారిపోయింది. ఓయో బ్రాండ్ అనే దానికి ఇదో నిదర్శనం.
అన్ మ్యారీడ్ కపుల్స్‌కి ఆహ్వానం..
ఓయో అనే సంస్థ.. పలు హోటల్స్‌తో ఒప్పందాల ద్వారా దేశవ్యాప్తంగా బస సౌకర్యాలను విస్తరించడం ప్రారంభించిన సమయంలో ఈ పరిస్థితి లేదు. అయితే ఆ తర్వాత తర్వాత.. అన్ మ్యారీడ్ కపుల్ వెల్‌కమ్ అనే లైన్ ఎప్పుడైతే ఓయో యాప్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిందో.. అప్పటి నుంచే ఆ యాప్ డౌన్లోడ్స్‌తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోతూ వచ్చింది.
ఈ నేపధ్యంలోనే అకస్మాత్తుగా ఓయో బ్రాండ్ ఇటీవల తన పంధాను సంస్కరించుకోవడం ప్రారంభించింది. పెళ్లికాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వడం అనే విధానం నుంచి వెనక్కు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. పెళ్లికాని జంటలకు స్నేహపూర్వక విడిదిగా ప్రసిద్ది చెందిన ఈ బ్రాండ్ గత కొన్ని నెలలుగా సకుటుంబ - ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా ఓయోను రీబ్రాండ్ చేయడానికి కృషి చేస్తోంది.
పెళ్లికాని జంటలకు సంబంధించి తన చెక్ - ఇన్ విధానాన్ని సవరించడం మీరట్‌లో ప్రారంభం కావడం మొదలు.. ఓయో హోటల్ సోషల్ మీడియాలో చర్చోపచర్చలకు దారి తీసింది. ఈ నేపధ్యంలోనే సంస్థ వ్యవస్థాపకుడు 'రితేష్ అగర్వాల్' మీడియాతో మాట్లాడారు. తమపై పడిన బ్రాండింగ్‌ను ఉద్దేశించి.. ఇది ఎక్కువగా మీమ్స్‌తో ముడిపడిన ’సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించాడు.
తమ వ్యాపారంలో దాదాపు 70 - 80% కుటుంబాలు లేదా వ్యాపార ప్రయాణీకుల నుంచే వస్తుందనీ.. అయినప్పటికీ, సోషల్ మీడియా కొన్ని మీమ్‌ల ద్వారా తమపై మరో తరహా అభిప్రాయానికి ఆజ్యం పోసిందనీ ఆయన చెప్పారు. అయితే ఇదంతా కేవలం నగరాల్లో అదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమేనని తీసిపారేశారు. అయితే తాను ఓ రకంగా దీనిని అభినందిస్తున్నాననీ.. ఎందుకంటే ఇది (పెళ్లికాని జంటల బస) సమాజానికి కూడా ఒక సవాలుగా ఉంది కదా అన్నారాయన.
తమ బ్రాండ్‌కు ఆథ్యాత్మిక ఇమేజ్ తేవడానికి కూడా ఆయన ప్రయత్నించినట్టు కనిపించింది. అయోధ్యలో 80 హోటళ్లను ప్రారంభించామనీ.. వారణాసి, రామేశ్వరం, అజ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికప్రదేశాలలో తాము భాగస్వాములను కలిగి ఉన్నామనీ ఆయన చెప్పుకొచ్చారు. తమ బ్రాండ్‌పై సోషల్ మీడియా మీమ్‌లు సృష్టించిన అపోహల గురించి గుసగుసలాడే బదులు, మా బ్రాండింగ్‌కి ఎదరువుతున్న సవాలును ధైర్యంగా నేరుగా ఎదుర్కొని పరిష్కరించాలనుకుంటున్నాం.. అన్నారాయన.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?
తమ కొత్త బ్రాండింగ్ వ్యూహం విజయవంతమైందని, గత మూడేళ్లలో కంపెనీ అత్యధిక యాప్ డౌన్‌లోడ్‌లు, రిపీట్ రేట్లు హోటల్ ఓపెనింగ్‌లను చూసిందన్నారు. మేం నిజంగా చాలా ప్రేమను పొందామని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వచ్చిన మీమ్‌లు తనను ఇబ్బంది పెట్టాయా లేదా తన కంపెనీని ఎలా గుర్తించిందనే దాని గురించి బాధగా అనిపించిందా అని అడిగినప్పుడు.. అగర్వాల్ స్పందిస్తూ, అదేం లేదు, ఓయో.. కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన బ్రాండ్. ఇది అనేక ఉత్తమ కార్పొరేట్ అవార్డులను సాధించిందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment