అదానీ గ్రూప్ (Adani Group) అధినేత, దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) వివాహం శుక్రవారం (ఫిబ్రవరి 7) అంగరంగ వైభవంగా జరుగుతోంది. దివా జైమిన్ షాను ఆయన పెళ్లాడుతున్నారు. వివాహం సందర్భంగా ఈ నవ జంట స్ఫూర్తిదాయక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ వధువులకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని గౌతమ్ అదానీ స్వయంగా తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. "జీత్, దివా తమ వివాహ జీవితాన్ని ఒక గొప్ప ప్రతిజ్ఞతో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ సోదరీమణుల వివాహానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని వారు 'మంగళ సేవ' ప్రతిజ్ఞ చేశారు. ఒక తండ్రిగా, ఈ ప్రతిజ్ఞ నాకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ఈ చొరవ చాలా మంది దివ్యాంగ అమ్మాయిలు, వారి కుటుంబాలు ఆనందం, గౌరవంతో జీవించడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను" అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. కొత్తగా పెళ్లయిన 21 మంది దివ్యాంగ వధువులను, వారి భర్తలను తాజాగా కలుసుకున్న జీత్ అదానీ ఈ కొత్త చొరవను ప్రారంభించారు.
ఇరవై ఏడేళ్ల జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ఎనిమిది విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి పోర్ట్‌ఫోలియో ఉన్న దేశంలోని అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జీత్.. అదానీ గ్రూప్‌నకు సంబంధించిన రక్షణ, పెట్రోకెమికల్స్, కాపర్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రూప్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ బాధ్యతలను కూడా ఆయనే చూస్తున్నారు.
దివ్యాంగుల సమస్య జీత్ హృదయానికి దగ్గరగా ఉన్న అంశం. ఇటీవల షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన సందర్భంగా ప్రముఖ టీవీ షోలో దివ్యాంగులైన ఎంట్రాప్రెన్యూర్‌లు, దివ్యాంగుల కోసం పనిచేసే వారి కోసం ఒక ప్రత్యేక ఎపిసోడ్ ఉండాలని ఆయన సూచించారు. పీపుల్ గ్రూప్, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ఆ మేరకు "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించారు. అదానీ గ్రూప్ తన శ్రామిక శక్తిలో ఐదు శాతం దివ్యాంగులు ఉండేలా ఆదేశించిందని అదే సందర్భంగా జీత్ అదానీ వెల్లడించారు.
అదే ప్రేరణ
ఈ చొరవకు తనను ప్రేరేపించిన దాని గురించి మాట్లాడుతూ.. భారతదేశం అంతటా అవుట్‌లెట్‌లు ఉన్న.. వెనుకబడిన నేపథ్యాలకు చెందిన దివ్యాంగులకు ఉపాధి కల్పించే మిట్టి కేఫ్‌ను సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను మిట్టి కేఫ్ (ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో) ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు, అన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అక్కడి సిబ్బంది చిరునవ్వు, ఆత్మ స్థైర్యం నన్ను కదిలించాయి" అని జీత్ అదానీ అన్నారు. గుజరాత్‌లోని ముంద్రాలో ఒక చిన్న గ్రామీణ ప్రాజెక్ట్ నుండి అదానీ ఫౌండేషన్‌ను ఒక శక్తిగా మార్చిన తన తల్లి ప్రీతి అదానీ కూడా తనకు ప్రేరణ అని ఈ యువ వ్యాపారవేత్త చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment