
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల సవరణకు అనుమతించడం వల్ల.. కొత్తగా 5 లక్షల సవరించిన (అప్‌డేటెడ్) రిటర్నులు దాఖలు కావడంతోపాటు, రూ.400 కోట్ల అదనపు పన్ను ఆదాయం కేంద్రానికి వచ్చింది. ఫైనాన్స్ యాక్ట్, 2022లో సవరించిన రిటర్నుల క్లాజును ప్రవేశపెట్టడం తెలిసిందే. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఒకసారి రిటర్నులు సమర్పించిన అసెస్‌మెంట్ ఏడాది నుంచి, రెండేళ్లలోపు సవరణలు దాఖలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఐటీఆర్–యు పత్రం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చింది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైనా ఆదాయం వెల్లడించకపోయి ఉంటే, ఈ నూతన ఫామ్ రూపంలో సవరణలు దాఖలు చేసుకునే అవకాశం లభించింది.
దీంతో 5 లక్షల మంది ఐటీఆర్–యు దాఖలు చేసి రూ.400 కోట్ల పన్ను చెల్లించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిబంధనల అమలు సులభతరం అయిందని, కార్పొరేట్లు సైతం సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ‘‘ఒక కంపెనీ సవరించిన రిటర్నులు సమర్పించి రూ.కోటి పన్ను చెల్లించింది. స్వచ్ఛందంగా నిబం«దనలను అనుసరిస్తున్న వారు పెరుగుతున్నారు. ప్రజలు పన్ను చెల్లించి స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు’’అని ఆ అధికారి వాస్తవ పరిస్థితి వివరించారు. సవరణ రిటర్నుల్లో, గతంలో పేర్కొనని ఆదాయ వివరాలు వెల్లడిస్తున్నట్టు అయితే అందుకు కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది.