Russia Ukraine War Impact: Crude Oil Prices Touched All Time Second High - Sakshi
Sakshi News home page

Russia Ukraine War Impact: ఇటు రష్యా అటు నాటో.. ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలు

Published Mon, Mar 7 2022 11:55 AM | Last Updated on Mon, Mar 7 2022 12:40 PM

Russia Invasion Ukraine: Crude Oil  Prices Touched All time Second High - Sakshi

ప్రపంచ దేశాలను ముడి చమురు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్‌ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతుండటం మిగిలిన దేశాలకు చిక్కులు తెస్తోంది. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు ధర రెండో గరిష్ట స్థాయిని అందుకుంది. 

నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తుందంటూ రష్యా చేపట్టిన దండయాత్ర పది రోజులు దాటినా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఓవైపు ఉక్రెయిన్‌లో ఒక్కో నగరానికి కీలక స్థావరాలను రష్యా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటోతో పాటు ఈయూ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలా రెండు వైపులా ఒత్తిడి పెరిగిపోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

దిగుమతి చేసుకోం?
ప్రపంచ ఆయిల్‌ మార్కెట్లలో గల్ఫ్‌ తీరంలో ఉన్న ఒపెక్‌ దేశాల తర్వాత వెనుజువెలా, రష్యాలదే అగ్రస్థానం. రష్యా ఒక్కటే ప్రపంచ ఆయిల్‌ ఉత్పత్తిలో 10 శాతం వాటాను కలిగి ఉంది. నిన్నా మొన్నా వరకు ఆర్థిక ఆంక్షలు తప్ప ఆయిల్‌పై నాటో, ఈయూ దేశాలు ఆంక్షలు విధించలేదు. యుద్ధం జరుగుతున్నా రష్యా ఆయిల్‌ దిగుమతిపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కానీ నో ఫ్లైజోన్‌ విషయంలో నాటో దేశాలు లక్ష్యంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ చేస్తోన్న విమర్శలు ఆ దేశాల అధినేతలను చుట్టుముడుతున్నాయి. ఫలితంగా రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతిపై ఆంక్షలు విధిస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

అమెరికాకే ఇబ్బంది
పెట్రోలు దిగుమతిలో అమెరికా ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. గతంలో అణ్వాయుధాల తయారీ నెపంతో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. తాజాగా రష్యాపై కూడా ఆయిల్‌ ఆంక్షలు అమలు చేయనుంది. ఇదే జరిగితే అతి పెద్ద ఆయిల్‌ వినియోగదారైన అమెరికా కేవలం ఒపెక్‌ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఉన్న పళంగా డిమాండ్‌ పెరిగిపోనుంది.

ముడి బిగుస్తోంది
పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా అధికంగా ఆయిల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఒపెక్‌ దేశాలు సుముఖంగా లేవు. దీనికి తోడు మరో ఆయిల్‌ ఉత్పత్తి దేశమైన లిబియాలోనూ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఆయిల్‌ ఉత్పత్తి పెంచొద్దంటూ సాయుధ దళాల నుంచి బెదిరింపులు రావడంతో అక్కడ రెండు చోట్ల ముడి చమురు వెలికి తీత ఆగిపోయింది. 

మండుతున్న ధర
డిమాండ్‌కు తగ్గస్థాయిలో చమురు లభ్యత తగ్గిపోవడంతో బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఆదివారం 139 డాలర్లకు చేరుకుంది. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా బ్యారెల్‌ ధర 143 డాలర్లుగా పలికింది. ఆ తర్వాత ఇదే అత్యధికం. సోమవారం బ్యారెల్‌ ధర కొంత తగ్గి 129 డాలర​​‍్ల దగ్గర ట్రేడవుతోంది. కానీ యుద్ధం తెచ్చిన ఉద్రిక్తతలు అలాగే ఉండటం కలవరం కలిగిస్తోంది. శాంతి నెలకొనని పక్షంలో ఏ క్షణమైనా మరోసారి ఆయిల్‌ ధరలు ఆకాశం తాకడం గ్యారెంటీ అనే భయం నెలకొంది.

చిక్కులు
వెరసి ఉక్రెయిన్‌ను కేంద్రంగా చేసుకుని రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు మొదలు పెట్టిన ఆధిపత్య పోరు సెగ ప్రపంచ దేశాలను తాకుతోంది. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుత్ను దేశాలకు చమురు ధరల పెరుగుదల వణికిస్తోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే ద్రవ్యోల్బణం తప్పని దుస్థితి ఎదురుకానుంది.

చదవండి: ఉక్రెయిన్ - రష్యా వార్ ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement