
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో ప్రపంచ దిగ్గజాల ద్వారా వరుస పెట్టుబడులతో హోరెత్తించిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అననుబంధ సంస్థలో పెట్టుబడుల సమీరణపై దృష్టి కేంద్రీకరించింది. జియో ఫైబర్ పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (రిలయన్స్ : "నెట్‌మెడ్స్" డీల్)
జియో ఫైబర్ లో మేజర్ వాటాను సౌదీ అరేబియా ఆధారిత పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్)కు విక్రయించనుంది. తద్వారా వందకోట్ల డాలర్ల (సుమారు 7495 కోట్ల రూపాయలు) విలువైన పెట్టుబడిని రిలయన్స్ దక్కించుకోనుంది. అలాగే పీఐఎఫ్‌తో పాటు, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఎడిఐఎ) కూడా ఆర్‌ఐఎల్ తో మరో డీల్ చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 300 బిలియన్ డాలర్ల విలువైన పోర్ట్‌ఫోలియోను సాధించే లక్ష్యంలో భాగంగా ఈ చర్చలు సాగుతున్నట్టు తెలిపింది. అయితే ఈ ఒప్పందంపై ఆర్‌ఐఎల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఈ రెండు ఒప్పందాలు నిర్ధారణ అయితే ఆర్‌ఐఎల్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పీఐఎఫ్ ఇప్పటికే జియోలో భారీ పెట్టుబడులు పెట్టింది. మరోవైపు మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ సౌదీ అరామ్‌కో కూడా రిలయన్స్ పెట్రో కెమికల్ రిఫైనింగ్ వ్యాపారంలో మేజర్ వాటాను కొనుగోలు చేయడానికి ఆర్‌ఐఎల్‌తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment