న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు వ్యాపారంలోని ఎస్‌బీఐ కార్డ్ సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.526 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 22 శాతం పెరిగి రూ.4,221 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధి చెంది రూ.1,902 కోట్లకు చేరింది. ఇతర వనరుల రూపేణా ఆదాయం 21 శాతం అధికంగా రూ. 2,186 కోట్లు సమకూరింది.
కంపెనీ రుణ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల రుణాల్లో వసూలు కాని నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.43 శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.14 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.78 శాతం నుంచి రూ.0.89 శాతానికి పెరిగాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 23.3 శాతంగా ఉంది. సెపె్టంబర్ చివరికి నికర విలువ 11,130 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరికి వినియోగంలో ఉన్న కార్డులు 1.79 కోట్లుగా ఉన్నాయి.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ కార్డ్ షేరు 2 శాతానికి పైగా లాభపడి రూ.791 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment