ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్‌డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..
ఎల్‌పీజీ ధరలు
ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.
సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లు
ఎల్‌పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.
ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్
ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్‌డేట్‌లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్‌డేట్‌ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.
క్రెడిట్ కార్డ్ నియమాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్‌లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్‌లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.
మోసపూరిత కాల్స్ నియమాలు
మోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
డియర్నెస్ అలవెన్స్
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment