
న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్‌డీటీవీ)షేర్ల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
అప్పీల్‌కు కంపెనీ...
అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్‌పై అప్పీల్‌కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్‌డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్‌పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్‌ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment