SEBI to phase out share buybacks through stock exchanges - Sakshi
Sakshi News home page

షేర్ల బైబ్యాక్‌పై సెబీ కీలక నిర్ణయం.. ఇక స్టాక్‌ ఎక్స్ఛేంజీల విధానానికి చెల్లుచీటీ!

Published Wed, Dec 21 2022 11:37 AM | Last Updated on Wed, Dec 21 2022 12:53 PM

Sebi Share Buybacks Through Stock Exchanges Phased Out - Sakshi

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్‌ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు మంగళవారం(20న) జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్‌ సమయాన్ని కుదించడం, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలలో సుపరిపాలన పెంపు, తదితర పలు చర్యలను చేపట్టింది. చైర్మన్‌ మాధవీ పురీ బచ్‌ అధ్యక్షతన సమావేశమైన సెబీ బోర్డు పలు ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

స్టాక్‌ ఎక్స్ఛేంజీల రూట్‌కు చెక్‌
లిస్టెడ్‌ కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా చేపట్టే విధానానికి దశలవారీగా తెరపడనుంది. ఈ విధానంలో లొసుగులకు చెక్‌ పెడుతూ భవిష్యత్‌లో టెండర్‌ మార్గంలోనే వీటిని అనుమతించనుంది. ఇకపై ప్రస్తుత విధానంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా బైబ్యాక్‌ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75% వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

కేకి మిస్త్రీ కమిటీ సూచనలు
చ్‌డీఎఫ్‌సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ అధ్యక్షతన ఏర్పాటైన సెబీ కమిటీ షేర్ల బైబ్యాక్‌ మెకనిజంలో మార్పులను సూచించింది. 2025 ఏప్రిల్‌కల్లా స్టాక్‌ ఎక్స్ఛేంజీల విధానానికి గుడ్‌బై చెప్పమని సలహా ఇచ్చింది. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో బైబ్యాక్‌ను 18 రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. వీటితోపాటు రికార్డ్‌ డేట్‌కు ఒక రోజు ముందువరకూ బైబ్యాక్‌ ధరను పెంచేందుకు వీలు కల్పించింది.పస్తుతం బైబ్యాక్‌లకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, టెండర్‌ ఆఫర్‌ మార్గాలను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

గ్రీన్‌ బాండ్లకు దన్ను: గ్రీన్‌ బాండ్ల మార్గదర్శకాలకు బలాన్నిస్తూ బ్లూ బాండ్లు, యెల్లో బాండ్ల జారీకి అనుమతించింది. తద్వారా నిలకడైన ఫైనాన్స్‌కు కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. గ్రీన్‌ రుణ సెక్యూరిటీలలో భాగంగా వాటర్‌ మేనేజ్‌మెంట్, సముద్ర సంబంధ(మెరైన్‌) రంగాలకు బ్లూ బాండ్లు, సోలార్‌ ఎనర్జీకి యెల్లో బాండ్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా గ్రీన్‌వాషింగ్‌ సంబంధ రిస్కులకు చెక్‌ పెట్టనుంది.

అంటే గ్రీన్‌ బాండ్ల జారీ ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ లబ్ధి అంతగాలేని ప్రాజెక్టులకు మళ్లించడాన్ని అడ్డుకోనుంది. కాలుష్య నివారణ, నియంత్రణలతోపాటు.. పర్యావరణ అనుకూల ప్రొడక్టులకు నిధులు లభించేలా నిబంధనలకు తెరతీసింది. దేశీ కంపెనీలు ఈఎస్‌జీ, గ్రీన్‌ బాండ్ల ద్వారా 2021లో 7 బిలియన్‌ డాలర్లను సమీకరించాయి. 2020లో ఇవి కేవలం 1.4 బిలియన్‌ డాలర్లుకాగా.. 2019లో 4 బిలియన్‌ డాలర్లు సమకూర్చుకున్నాయి. గ్రీన్‌ బాండ్లలో అత్యధికం విదేశీ ఎక్స్ఛేంజీలలో లిస్టవుతున్నాయి.

మూడు కీలక విభాగాలుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సహా క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలు తదితర మార్కెట్‌ మౌలిక సంస్థ(ఎంఐఐ)లలో మరింత సుపరిపాలనకు నిబంధనలు సవరించింది. దీంతో మెరుగైన పారద్శకత, జవాబుదారీతనాలకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎంఐఐలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. వీటిని క్రిటికల్‌ ఆపరేషన్స్, రెగ్యులేటరీ, కంప్లయెన్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌సహా ఇతర కార్యకలాపాలుగా పేర్కొంది.

ఇతర నిబంధనలు...
మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు ఎగ్జిక్యూషన్‌ ఓన్లీ ప్లాట్‌ఫామ్స్‌(ఈవోపీ) విధానానికి తెరతీసింది. తద్వారా ఎంఎఫ్‌ స్కీముల ప్రత్యక్ష పథకాలలో పెట్టుబడులకు సరళతను తీసుకువచ్చింది. డిజిటల్‌ మార్గంలో వీటికి సంబంధించిన కొనుగో లు, రిడెంప్షన్‌లను చేపట్టేందుకు వీలుంటుంది.

కొన్ని సందర్భాలలో ట్రేడింగ్‌ సర్వీసుల వైఫల్యంతో ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్‌ పెడుతూ ఇన్వెస్టర్‌ రిస్క్‌లు తగ్గించే ప్లాట్‌ఫామ్‌ను వచ్చే ఏడాది(2023–24) మూడో త్రైమాసికానికల్లా ప్రవేశపట్టే వీలుంది. తద్వారా స్టాక్‌ బ్రోకర్లు అందించే సర్వీసుల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు ఇన్వెస్టర్లకు రక్షణగా ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి వచ్చే వీలుంది.

లిస్టెడ్‌ కంపెనీల బాటలో రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(ఇన్విట్స్‌)కు సైతం పాలనా సంబంధ మార్గదర్శకాలు రూపొందించింది. ఆడిటర్ల ఎంపిక, క్లెయిమ్‌కాని, చెల్లించని పంపిణీకాని నిధులు తదితర అంశాలలో నిబంధనలను క్రమబద్ధీకరించింది. దీంతో ఈ నిధులు ఇన్వెస్టర్‌ రక్షణ, ఎడ్యుకేషన్‌ ఫండ్‌కు బదిలీకానున్నాయి.
చదవండి: 8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్‌తో కేంద్రం ఆదాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement