గోల్డ్‌ ఎక్స్చేంజీకి మార్గదర్శకాలు | SEBI unveils roadmap for bullion trading | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఎక్స్చేంజీకి మార్గదర్శకాలు

Published Tue, May 18 2021 4:21 AM | Last Updated on Tue, May 18 2021 4:58 AM

SEBI unveils roadmap for bullion trading - Sakshi

న్యూఢిల్లీ: పసిడి ట్రేడింగ్‌కు సంబంధించి గోల్డ్‌ ఎక్సే్చంజీ ఏర్పాటుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విస్తృతమైన మార్గదర్శకాలను ప్రతిపాదించింది. దేశీయంగా స్పాట్‌ మార్కెట్లో రేట్ల విధానం పారదర్శకంగా ఉండేందుకు ఇవి తోడ్పడనున్నాయి. వీటి ప్రకారం ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ రూపంలో ట్రేడింగ్‌ ఉంటుంది. 1 కిలో, 100 గ్రాములు, 50 గ్రాములు, కొన్ని నిబంధనలకు లోబడి 10 గ్రాములు, 5 గ్రాముల పసిడిని కూడా ప్రతిఫలించేలా ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌)లో ట్రేడ్‌ చేయొచ్చు.

ఇందుకు సంబంధించిన చర్చాపత్రం జారీ చేయడంతో పాటు వాల్ట్‌ మేనేజర్లకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను కూడా సెబీ ప్రతిపాదించింది. సెబీ ఇంటర్మీడియరీలుగా వాల్ట్‌ మేనేజర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో బంగారం వినియోగించే భారత్‌లో .. పసిడి ట్రేడింగ్, ఫిజికల్‌ డెలివరీ మొదలైన వాటన్నింటిలో పారదర్శకత తెచ్చేందుకు ప్రతిపాదిత గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ తోడ్పడగలదని సెబీ పేర్కొంది. ఈ చర్చాపత్రంపై సంబంధిత వర్గాలు జూన్‌ 18లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. అసలు ఈజీఆర్‌ల ట్రేడింగ్‌ కోసం ప్రత్యేకంగా కొత్త ఎక్సే్చంజీ అవసరమా లేక ప్రస్తుతమున్న స్టాక్‌ ఎక్సే్చంజీలనే ఉపయోగించుకోవచ్చా అన్న అంశంపై కూడా అభిప్రాయాలు తెలపాలంటూ సెబీ కోరింది.

మూడు దశలు...
సెబీ మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో మొత్తం మూడు దశలు ఉంటాయి. తొలి దశలో భౌతిక రూపంలోని బంగారానికి సరిసమాన విలువ గల ఈజీఆర్‌ను రూపొందిస్తారు. ఇందుకోసం వాల్ట్‌ మేనేజర్లు, డిపాజిటరీలు, స్టాక్‌ ఎక్సే్చంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడిగా ఇంటర్‌ఫేస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని సెబీ సూచించింది. ఇక రెండో దశలో ఈజీఆర్‌ను ఎక్సే్చంజీలో లిస్ట్‌ చేస్తారు. దానికి సంబంధించి రోజువారీ సమాచారాన్ని డిపాజిటరీలు.. ఎక్సే్చంజీలకు తెలియజేస్తాయి.

లావాదేవీలను క్లియరింగ్‌ కార్పొరేషన్‌ సెటిల్‌ చేస్తుంది. చివరిగా మూడో విడతలో ఈజీఆర్‌ను మళ్లీ భౌతిక బంగారం రూపంలోకి మారుస్తారు. దీన్ని పొందడానికి కొనుగోలుదారు ఈజీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వాల్టుల్లో భౌతిక రూపంలో బంగారం లేకుండా వాల్ట్‌ మేనేజర్లు.. ఈజీఆర్‌ను రూపొందించడానికి ఉండదు. మరింత మంది ఇన్వెస్టర్లను మార్కెట్లోకి ఆకర్షించే దిశగా స్వల్ప పరిమాణం.. 5 గ్రాములు, 10 గ్రాముల స్థాయిలోనూ ట్రేడింగ్‌ అనుమతించవచ్చని సెబీ తెలిపింది. అయితే, అంత తక్కువ పరిమాణంలో పసిడి డెలివరీలో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. లబ్ధిదారు కొనుగోలు చేసిన ఈజీఆర్‌ కనీసం 50 గ్రాముల దాకా చేరితేనే దాన్ని భౌతిక పసిడి రూపంలోకి మార్చవచ్చని పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement