
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వీకెండ్‌లో లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. వరుసగా రెండురోజుల లాభాలను వదులుకొని ఆరంభంలోనే 200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ ఆ వెంటనే నష్టాలనుంచి కోలుకుంది. చివరికి సెన్సెక్స్ 130 పాయింట్లు ఎగిసి 59462 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి17698 వద్ద ముగిసింది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా , ఐటీ నష్టపోయాయి.
ఆయిల్ & గ్యాస్ సూచీలు 2.5, మెటల్ అండ్ పవర్ 1.5 శాతం పెరిగాయి. మరోవైపు, ఫార్మా ఇండెక్స్ 1 శాతం క్షీణించగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.76 శాతం పడిపోయింది. ఓఎన్‌జీసీ, టాటాస్టీల్, హిందాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్, యూపిఎల్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి సుజుకి, నెస్లే నష్టపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 8పైసలు క్షీణించి 79.7వద్ద ముగిసింది.