ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 871 పాయింట్లు పతనమై 49,180 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి 14,549 వద్ద నిలిచింది. దీంతో ఇరు సూచీలు ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు(నేడు) నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు పతనమైంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు వెంటాడాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఈ ప్రతికూలాంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను, దెబ్బతీశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మేవాళ్లే తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో ఒకదశలో సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్ల మేర నష్టపోయాయి.
నిఫ్టీ సూచీలోని మొత్తం 50 షేర్లకు గానూ మూడు షేర్లు, సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,952 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.613 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘బేర్స్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరచడంతో బుధవారం సూచీలు రెండుశాతం నష్టపోయాయి. కరోనా ర్యాలీ తర్వాత మార్కెట్లో పెద్దగా దిద్దుబాటు జరగలేదు. అయితే ఇటీవల దేశంలో తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులతో దిద్దుబాటుకు అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ పట్ల అప్రమత్తత వహించడంతో పాటు లాంగ్, షార్ట్‌టర్మ్ పొజిషన్లను మెయింటైన్ చేయాల్సిందిగా ట్రేడర్లకు సలహానిస్తున్నాం’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు.
ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే....
ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 265 పాయింట్ల నష్టంతో 49,786 వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల పతనంతో 14,712 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతతో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేందుకే ఆసక్తి చూపారు. మారిటోరియంపై సుప్రీం తీర్పు తర్వాత బ్యాంకులకు రూ. లక్ష కోట్ల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) జతవుతాయన్న వార్తలతో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. డాలర్ ఇండెక్స్ బలపడటంతో మెటల్ షేర్లు కరిగిపోయాయి. మిడ్‌సెషన్‌లో విక్రయాల తీవ్రత కాస్త తగ్గి నష్టాలు రికవరీ అవుతున్న తరుణంలో యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం అవడంతో సూచీలు తిరిగి నష్టాల బాటపట్టాయి. ఒకదశలో సెన్సెక్స్ 931 పాయింట్ల నష్టపోయి 49,120 వద్ద, నిఫ్టీ ఇండెక్స్ 279 పాయింట్ల మేర క్షీణించి 14,535 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి.
నిమిషానికి రూ.860 కోట్ల నష్టం...
సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు నిమిషానికి రూ.860 కోట్లు నష్టపోయారు. ఆరున్నర గంటల ట్రేడింగ్ సెషన్‌లో మొత్తం రూ.3.27 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.202 లక్షల కోట్లకు దిగివచ్చింది.
అనుపమ్ రసాయన్ వీక్ లిస్టింగ్
6.6% నష్టంతో రూ. 519 వద్ద ముగింపు
న్యూఢిల్లీ: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అనుపమ్ రసాయన్ ఎక్సే్ఛంజీలలో తొలి రోజు నీరసంగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 555తో పోలిస్తే బీఎస్‌ఈలో 3.7% డిస్కౌంట్‌తో రూ.535 దిగు వన ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి 10% వరకూ పతనమై రూ.501కు చేరింది. చివరికి 5.3% నష్టంతో రూ. 526 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ అనుపమ్ రసాయన్ 6.3% తక్కువగా రూ.520 వద్ద లిస్టయ్యింది. ఆపై ఇంట్రాడేలో రూ. 549 వద్ద గరిష్టాన్నీ, రూ.502 వద్ద కనిష్టాన్నీ తాకింది. చివరికి 6.6% కోల్పోయి రూ.519 దిగువన స్థిరపడింది.
నష్టాలకు నాలుగు కారణాలు...
► కరోనా భయాలు...
మలి దశలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 45 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి. కేసులు పుంజుకుంటున్న వేళ 18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్ మరింత కలవరపెడుతోంది. ఊహిం చని రీతిలో పెరుగుతున్న కేసులు క్రమంగా లాక్‌డౌన్లకు దారితీయవచ్చని, తద్వారా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి కుదేలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
► భౌగోళిక ఉద్రిక్తతలు...
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తరువాత ఉత్తర కొరియా తొలిసారిగా పలు క్షిపణులను పరీక్షించడం కలకలం రేపింది. అమెరికా మాత్రం ఈ పరీక్షలను తేలిగ్గానే తీసుకుంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
► బలహీన అంతర్జాతీయ సంకేతాలు...
కరోనా వ్యాధి నివారణకు వినియోగించే ఫైజర్ టీకాను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించడంతో ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలతో పాటు ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యల కోసం ఎదురుచూపుల నేపథ్యంలో అంతకుముందు (మంగళవారం)రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కరోనా కేసుల నివారణకు పలు చోట్ల లాక్‌డౌన్ విధింపుతో యూరప్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు చెందిన స్టాక్ సూచీలు బలహీనంగా ప్రారంభమై, స్వల్పనష్టాలతో ముగిశాయి.
► బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ...
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంతకుముందు రోజు భారీగా ర్యాలీ చేసిన బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అలాగే మొండిబకీలు భారీగా పెరగవచ్చనే అంచనాలు బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలకు కారణమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment