
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల బుధవారం ట్రేడింగ్‌ను కరోనా వేవ్ భయాలు చుట్టుముట్టాయి. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ కారణం చేత మదుపరులు వారి షేర్లను అమ్మకాలకు పెట్టారు. దీనితో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం నుంచి ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు.
ఉదయం 49,786 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకి 49,851 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద ముగిసింది. ఇక 14,712 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ మొత్తం 14,535-14,752 మధ్య కదలాడుతూ చివరకు 265 పాయింట్ల నష్టంతో 14,549 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద ఉంది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. సిప్లా, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభాలతో ముగిస్తే.. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిసాయి.