
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో లాభపడిన సూచీలు చివరలో కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెన్సెక్స్ 389 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 62,182 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 18,497 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రా డేలో ఏకంగా 700 పాయింట్లకు పైగా పడి 61,889 కనిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 18,500 మార్క్‌ను బ్రేక్ చేసింది.
ఎఫ్‌ఎంసిజి, ఫార్మా లాభపడగా, ఐటీ ఇండెక్స్ 3.16 శాతం పతనమైంది. అలాగే పీఎస్‌యూ బ్యాంక్ రియాల్టీ సూచీలు వరుసగా 1.7 శాతం1.5 శాతం నష్టపోయాయి. నెస్లే, టైటన్, సన్ ఫార్మ, డా.రెడ్డీస్, ఐషర్ మోటార్స్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ ఏకంగా 6 శాతం కుప్పకూలింది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విపప్రో, హిందాల్కో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 18 పైసలు ఎగిసి 82.28 వద్ద ముగిసింది.