న్యూఢిల్లీ: కనిష్ట స్థాయిల వద్ద అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీ, రూపాయి విలువ బలపడటం, దిగివచ్చిన చమురు ధరలు వంటి సానుకూలాంశాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెనెక్స్ 568 పాయింట్లు పెరిగి 49,009 వద్ద స్థిరపడింది. సెనెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 14,507 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండురోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లైంది.
మార్కెట్ రెండురోజుల భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదునుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లలో అధికంగా కొనుగోళ్లు కన్పించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.50 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,703 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఇక వారం మొత్తం మీద సెనెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 236 పాయింట్లను కోల్పోయాయి.
‘‘కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్ విధింపులతో రికవరీ అవుతున్న ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చనే భయాల మధ్య మార్కెట్‌లో స్థిరీకరణ చోటు చేసుకుంటోంది. ఈ బౌన్స్‌బ్యాక్ కేవలం స్వల్పకాలికమే. మార్కెట్లో స్థిరమైన పరిస్థితులు నెలకొనే వరకు ట్రేడర్లు అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్‌ను కొనసాగించాలి. నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకొనేందుకు ఇది సరైన సమయం. రెండో దశ కోవిడ్ కేసుల నమోదు, అధిక వ్యాల్యుయేషన్లలతో మార్కెట్లో స్వల్పకాలం పాటు ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగుతుంది’’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఆరంభం నుంచి దూకుడుగానే....
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్ భారీ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 48,969 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 14,506 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. భారీ గ్యాప్ అప్ నేపథ్యంలో కొద్దిగా ఇంట్రాడేలో కొద్ది లాభాల స్వీకరణ జరిగింది. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లు మరింత విశ్వాసాన్నిచ్చింది. దీంతో మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.
అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీ...
కొద్దిరోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం రికవరీ బాటపట్టాయి. అర్థిక అగ్రరాజ్యమైన అమెరికాలో ఉద్యోగ నియమాక గణాంకాలు ఆర్థికవేత్తలను మెప్పించాయి. లాక్‌డౌన్ అవాంతరాలను అధిగమిస్తూ క్యూ4లో యూఎస్ స్థూల జాతీయోత్పత్తి 4.3 శా తంగా నమోదైంది. అలాగే అంతర్జాతీయంగా బాం డ్ ఈల్డ్స్ దిగివచ్చాయి. ఈ పరిణామాలన్నీ కలిసిరావడంతో ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, థాయిలాండ్, కొరియా, ఇండోనేషియా దేశాల స్టాక్ సూచీలు 1–2% లాభపడ్డాయి. యూరప్‌లోని ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు మార్కెట్లు ఒక శాతం పెరిగాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► నోయిడా ప్రాజెక్ట్‌లో మంచి విక్రయాలు జరగడంతో గోద్రేజ్ ప్రాపర్టీస్ షేరు 2.5 శాతం లాభపడి రూ.1,365 వద్ద
స్థిరపడింది.
► ఇండియా రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో వెల్‌స్పన్ ఇండియా షేరు 9% లాభంతో రూ.83 వద్ద ముగిసింది.
► గెయిల్ గ్యాస్‌తో వ్యూహాత్మక వ్యాపార ఒప్పందాన్ని చేసుకోవడంతో కాన్ఫిడెన్స్ పెట్రోలియం షేరు 5.5 లాభంతో రూ.43 వద్ద నిలిచింది.
► ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌కు సంబంధించి తక్కువ ధరకే బిడ్డింగ్ కోట్ చేయడంతో హెచ్‌జీ ఇన్ ఫ్రా 5% లాభపడి రూ.293 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment