
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలన్నీ కోల్పోయి భారీ నష్టాల్లో ముగిసాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాల ఒత్తిడి, ఫెడ్ వడ్డీరేట్ల భయాల కారణంగా, మంగళవారం సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్ట పోయింది. ఆరంభంలోనే డీలా పడిన సూచీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఐటీ, ఫైనాన్షియల్స్ బ్యాంకింగ్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. చివరికి సెన్సెక్స్ 632 పాయింట్లు పతనమై 60115 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు నష్టంతో 17925 వద్ద ముగిసాయి.
టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, పవర్ గ్రిడ్ , బీపీసీఎల్ లాభపడగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, భారతి ఎయిర్టెల్ తదితర షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 62పైసలు ఎగిసి 81.85 స్థాయికి చేరింది.
ఈ పతనంతో లక్షల కోట్ల బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్‌ఇ ఎం-క్యాప్ నమోదు ప్రకారం సోమవారం నాటి రూ.282.99 లక్షల కోట్ల విలువతో పోలిస్తే దలాల్ స్ట్రీట్ రూ. 3 లక్షల కోట్లను కోల్పోయింది. హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ లాంటి ఫ్రంట్‌లైన్ స్టాక్‌ల పతనం మార్కెట్‌ను బలహీనపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment