
ముంబై: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో బెంచ్‌మార్క్ సూచీలు రెండోరోజూ అదే జోరును కనబరిచాయి. దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.., వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయవచ్చనే ఆశలు నెలకొన్నాయి. కేంద్రం చేపట్టిన చర్యలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. లాభాల్లో ట్రేడ్ అవుతున్న ప్రపంచ మార్కెట్ల నుంచీ మద్దతు లభించింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు బలపడింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్లో సానుకూలతను నింపాయి. ఫలితంగా సెన్సెక్స్ 613 పాయింట్లు పెరిగి 50 వేలపైన 50,193 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి రెండునెలల గరిష్ట స్థాయి. నిఫ్టీ 185 పాయింట్లు ఎగసి 15వేల పైన 15,108 వద్ద ముగిసింది. ఈ ముగింపు నిఫ్టీకి ఏడువారాల గరిష్టస్థాయి కావడం విశేషం.
ఆటో రంగ షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, ఐటీ, మెటల్, రియల్టీ రంగ షేర్లు కూడా రాణించాయి. అయితే ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్లో విస్తృతస్థాయి కొనుగోళ్లు జరగడంతో 1:1 నిష్పత్తిలో షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 732 పాయిం ట్లు, నిఫ్టీ 214 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) అనూహ్యంగా కొను గోళ్లకు మొగ్గు చూపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.618 కోట్ల ఈక్విటీ షేర్లను కొన్నారు. అలాగే దేశీయ పెట్టుబడిదారులు రూ.450 కోట్ల షేర్లను కొన్నారు.
మార్కెట్ చూపు ఫెడ్ మినిట్స్ వైపు ....
ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగల అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు నేడు అప్రమత్తత వహించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.‘‘వరుసగా ఐదో రోజూ దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు కార్పొరేట్లు అంచనాలకు తగ్గట్లు మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి. అలాగే ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఈ పరిణామాలతో మూడు నెలల పాటు స్తబ్దుగా ట్రేడైన దేశీయ మార్కెట్ రెండు రోజులుగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తోంది’’ అని పేర్కొన్నారు.
ఆరంభంలో తడబడినా, ముందుకే..!
మునుపటి లాభాల ముగింపును కొనసాగిస్తూ మంగళవారం దేశీయ మార్కెట్ పాజిటివ్ మొదలైంది. సెన్సెక్స్ 406 పాయింట్లు పెరిగి 49,987 వద్ద, నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 15 వేల పైన 15,067 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్పంగా లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు కాస్త వెనకడుగు వేశాయి. అయితే బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో వ్యాల్యూ బైయింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు తిరిగి లాభాల బాటపట్టాయి. తదుపరి అన్ని రంగాల షేర్లు రాణించడంతో సూచీల ర్యాలీకి దశలో ఆటంకం కలుగలేదు.
రెండు రోజుల్లో రూ.5.78 లక్షల కోట్ల సంపద సృష్టి
మార్కెట్ వరుస ర్యాలీతో గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 1461 పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్లను ఆర్జించాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.5.78 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 216.44 లక్షల కోట్లను తాకింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment