తొలుత జూమ్‌.. తుదకు ఫ్లాట్‌ | Sensex rebounds over 270 points in early trade | Sakshi
Sakshi News home page

తొలుత జూమ్‌.. తుదకు ఫ్లాట్‌

Published Tue, Mar 9 2021 5:46 AM | Last Updated on Tue, Mar 9 2021 5:46 AM

Sensex rebounds over 270 points in early trade - Sakshi

ముంబై: రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే విదేశీ మార్కెట్ల ప్రభావంతో చివర్లో అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 36 పాయింట్లు బలపడి 50,441 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 14,956 వద్ద స్థిరపడింది. రోజంతా స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కదిలాయి. తొలి గంటలో సెన్సెక్స్‌ 667 పాయింట్లు జంప్‌చేసి 50,986ను తాకింది. తదుపరి ఆసియా మార్కెట్లు, యూఎస్‌ ఫ్యూచర్స్‌ బలహీనపడటంతో వెనకడుగు వేసింది. చివరి అర్ధగంటలో నష్టాలలోకి సైతం ప్రవేశించింది.  50,318 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 15,111–14,920 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. కాగా.. 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి యూఎస్‌ సెనేట్‌ ఆమోదముద్ర వేయడంతో తొలుత సెంటిమెంటుకు జోష్‌వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.  

ఎఫ్‌ఎంసీజీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా రంగాలు 1.6–0.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే రియల్టీ 1 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, గెయిల్, ఎల్‌అండ్‌టీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌సీఎల్‌ టెక్, ఐవోసీ, యాక్సిస్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ 7–1.5 శాతం మధ్య ఎగిశాయి. ఈ బాటలో పవర్‌గ్రిడ్, బీపీసీఎల్, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, ఆర్‌ఐఎల్, సిప్లా సైతం 1.2–0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్‌ఇండ్, శ్రీ సిమెంట్, బజాజ్‌ ఫైనాన్స్, అల్ట్రాటెక్, బజాజ్‌ ఆటో, ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, బజాజ్‌ ఫిన్, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, బ్రిటానియా, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.2–0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా...
డెరివేటివ్‌ విభాగంలో పీఎఫ్‌సీ, ఐఆర్‌సీటీసీ, గ్లెన్‌మార్క్, ఎన్‌ఎండీసీ, నాల్కో, భెల్, టొరంట్‌ పవర్, సెయిల్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ, జీ, కమిన్స్‌ ఇండియా 4.6–3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క అపోలో టైర్, టీవీఎస్‌ మోటార్, ముత్తూట్‌ ఫైనాన్స్, బెర్జర్‌ పెయింట్స్, పిడిలైట్, జూబిలెంట్‌ ఫుడ్, ఇండిగో, పేజ్, ఎంఫసిస్, బాటా 3.2–1.8 శాతం మధ్య నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3–0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 484 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 2,014 కోట్ల  అమ్మకాలు చేపట్టడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement