న్యూఢిల్లీ: రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు, వినియోగదారుల సంఘాలతో గురువారం సమావేశం నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడించారు.
‘‘సర్వీసు చార్జీ వసూలు చట్టబద్ధమేనని అసోసియేషన్‌లు పేర్కొన్నప్పటికీ వినియోగ వ్యవహారాల శాఖ అభిప్రాయం అయితే..ఇది వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తుంది. అంతేకాదు అనుచిత విధానం కూడా. 2017నాటి మార్గదర్శకాలు ఉన్నాయి కానీ, వాటిని అమలు చేయలేదు. కనుక త్వరలోనే చట్టపరమైన కార్యాచరణను ప్రకటిస్తాం. దాంతో చట్టప్రకారం అవి సర్వీసు చార్జీ వసూలు నిలిపివేయాల్సి ఉంటుంది’’అని రోహిత్ కుమార్‌సింగ్ తెలిపారు.
కస్టమర్లు సర్వీసు చార్జీని సర్వీస్ ట్యాక్స్ గా పొరబడి చెల్లిస్తుంటారన్నారు. వినియోగదారులు, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ లేవనెత్తిన అంశాలపై తాజా సమావేశంలో కేంద్రం ప్రస్తావించింది.
చట్టవిరుద్ధం కాదు..:‘‘ఇదే అంశం 2016–17లోనూ చర్చకు వచ్చింది. అప్పుడు అసోసియేషన్ తన స్పందన తెలిపింది. కాంపిటిషన్ కమిషన్‌కు సైతం మా వాదనను సమర్థవంతంగా వినిపించాం’’అని నేషనల్ రెస్టాంరెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రకటించింది.
‘‘సర్వీసు చార్జీ చట్ట విరుద్ధం కాదు, అనుచిత విధానమూ కాదు. ప్రజా వేదికపై ఈ చర్చ అనవసర గందరగోళానికి దారితీస్తుంది. రెస్టారెంట్ల సాఫీ కార్యాకలాపాలను ప్రభావితం చేస్తుంది’’అని ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ కబీర్‌సూరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment