ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు పతనమై 60,433 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లను కోల్పోయి 18,044 వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లైన హెచ్‌డీఎప్‌సీ ద్వయం, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల క్షీణత కూడా సూచీల లాభాల్ని హరించివేశాయి. ఆర్థిక, కన్జూమర్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, ఆటో, ఇంధన, మౌలిక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 456 పాయింట్లు పరిధిలో, నిఫ్టీ 130 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. లార్జ్ క్యాప్ షేర్లు విక్రయాల ఒత్తిడికి లోనప్పటికీ.., చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతం చొప్పున రాణించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు నివేదికలు తెలపడంతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు డిమాండ్ లభించింది.
సెమీ కండెక్టర్ల సమస్యలు తీరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి అమ్మకాలు పుంజుకోవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆటో రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,445 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్ల రూ.1,417 కోట్ల షేర్లను కొన్నారు.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..!
ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ఉదయం సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 60,610 వద్ద మొదలైంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 18,084 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 124 పాయింట్లు ర్యాలీ చేసి 60,670 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు ఎగసి 18,113 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాక నష్టాల బాటపట్టాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
►క్యూ2లో మార్జిన్లు నిరాశపరచడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.3,622 వద్ద ముగిసింది.
►విద్యుత్ వాహన వ్యాపారానికి నిధులనుసమీకరణకు సిద్ధమవడంతో టీవీఎస్ మోటార్ షేరు ఇంట్రాడేలో 14 శాతం ఎగసి రూ.814 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. అయితే లాభాల స్వీకరణ జరగడంతో చివరికి మూడుశాతం లాభంతో రూ.731 వద్ద స్థిరపడింది.
►భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఎల్‌అండ్‌టీ రెండు లాభంతో రూ.1964 వద్ద 52–వారాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం లాభంతో రూ.1944 వద్ద నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment