కోల్‌కతా: ఇటీవల కొంతకాలంగా వెండి ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఏడాది కాలంలో సిల్వర్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ నాలుగు రెట్లు ఎగసింది. వెరసి గత నెల(అక్టోబర్)కల్లా వెండి ఈటీఎఫ్‌ల ఏయూఎం రూ. 12,331 కోట్లను తాకింది.
2023 అక్టోబర్‌లో ఈ విలువ కేవలం రూ. 2,845 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లు సిల్వర్‌ను దేశీయంగా ధరల పెరుగుదలతోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు హెడ్జింగ్‌గా భావించడం ఇందుకు జతకలిసినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా అనలిటిక్స్ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం..
2022లో షురూ
సిల్వర్ ఈటీఎఫ్‌లకు 2022లో తెరతీశారు. వీటి అందుబాటు, పారదర్శకతల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరగుతోంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 215 శాతం జంప్‌చేసి 4.47 లక్షలకు చేరింది. 2023 అక్టోబర్‌లో ఇది 1.42 లక్షలు మాత్రమే. ఈ కాలంలో నికర పెట్టుబడులు 24 శాతం ఎగశాయి. రూ. 643 కోట్లను తాకాయి.
మరోపక్క మార్కెట్లో 2023 ఏప్రిల్‌లో 8 వెండి ఈటీఎఫ్‌లు నమోదుకాగా.. 2024 ఆగస్ట్‌కల్లా 12కు పెరిగినట్లు ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్, సీనియర్ వీపీ అశ్వినీ కుమార్ వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగనున్నట్లు కుమార్ అంచనా వేశారు.
సులభ నిర్వహణ
సులభంగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ, చౌక వ్యయాలు వంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఆకర్షణను పెంచుతున్నాయి. ఫిజికల్ కొనుగోళ్లకు జీఎస్‌టీ వర్తించే సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్‌కావడంతో పెట్టుబడులకు లిక్విడిటీ సైతం ఉంటుంది. యూనిట్ల రూపంలో సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చునని కుమార్ తెలియజేశారు.
అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు ఉత్తమ రిటర్నులను సైతం అందిస్తున్నాయి. నెల రోజుల్లో 7.6 శాతం, 3 నెలల్లో 16 శాతం, 6 నెలలు పరిగణిస్తే 20.25 శాతం సగటున రాబడినిచ్చాయి. ఏడాది కాలాన్ని తీసుకుంటే 32.5 శాతం రిటర్నులు అందించాయి. ఇదే కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడులతో పోలిస్తే ఇవి అధికంకావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment