పిల్లల భవిష్యత్తు దృష్ట్యా 10-15 ఏళ్ల కోసం.. మల్టీక్యాప్ (ఫ్లెక్సీక్యాప్) లేదా స్మాల్ క్యాప్‌లలో అధిక రాబడుల కోసం ఏది మెరుగైన ఎంపిక అవుతుంది? చక్కని పోర్ట్‌ఫోలియో రీత్యా అంతర్జాతీయ ఫండ్స్‌కు ఎంత మేర కేటాయింపులు చేసుకోవచ్చు?- వరుణ్, పుణె
మార్కెట్ల హెచ్చు, తగ్గులను చూసి కలవర పడకపోతే మల్టీక్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది. అయితే, 10-15 ఏళ్ల దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. పెట్టుబడులు పెట్టి మర్చిపోయేట్టు అయితే, ఈక్విటీల్లో అనిశ్చితులకు చలించేట్టయితే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశం కాల వ్యవధే. మీ ప్రశ్న ప్రకారం 15 ఏళ్ల వరకు మీకు డబ్బుల అవసరం లేదు. మల్టీక్యాప్ ఫండ్స్ కూడా మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, వాటిల్లో రాబడులు మరీ ఎక్కువగా ఉండవు. అస్థిరతలు కొంత తక్కువ. ఎందుకంటే పెట్టుబడుల్లో వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. మీ రెండో ప్రశ్న అంతర్జాతీయ ఫండ్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫండ్స్‌లో మీకు పెట్టుబడులు లేనట్టయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో 15-20 శాతం నిధులను వీటికి కేటాయించుకోవచ్చు. అయితే, అంతర్జాతీయ ఫండ్స్‌ను విభిన్నంగా చూడరాదు. వీటిని సైతం మొత్తం ఈక్విటీ కేటాయింపుల్లో భాగంగానే చూడాలి. అంతర్జాతీయ ఫండ్స్‌కు 15-20 శాతం కేటాయింపులను ఒకే సారి కాకుండా కొంత కాల వ్యవధి పరిధిలో కేటాయించుకోవాలి. దీనివల్ల కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఏర్పడే నమ్మకానికి అనుగుణంగా మరింత కేటాయింపులు చేసుకోవడం లేదా అప్పటి వరకు చేసిన కేటాయింపులకు పరిమితం కావొచ్చు.
నా వయసు 55 ఏళ్లు. ముందస్తుగానే స్వచ్చంద పదవీ విరమణ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం నా నెలవారీ ఖర్చులు రూ.50,000. రిటైర్మెంట్ నిధి కింద రూ.80 లక్షలు సమకూర్చుకున్నాను. జీవించి ఉన్నంత కాలం క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం వచ్చేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? -నీరజ, హైదరాబాద్
రూ.80 లక్షల నిధిపై ప్రతి నెలా రూ.50,000 ఆదాయం కోరుకుంటున్నారు. అంటే ఈ లెక్కన వార్షికంగా ఉపసంహరించుకునే రేటు 7.5 శాతం అవుతుంది. ఇలా అయితే మీ దగ్గరనున్న నిధి తొందరగా కరిగిపోతుంది. పైగా మీరు ముందుగానే పదవీ విరమణ తీసుకుంటున్నారు. దీంతో ఈ నిధిపై ఎక్కువ కాలం పాటు ఆధారపడి ఉంటారు. కనుక మీ రిటైర్మెంట్ ప్రణాళికను మరో సారి సమీక్షించుకోవాలి. ఎవరైనా కానీయండి.. రిటైర్మెంట్ నిధి నుంచి ఉపసంహరణ రేటు అన్నది 5 శాతం మించకూడదని మేము విశ్వసిస్తాము. ఈ లెక్కన మీ రిటైర్మెంట్ నిధిపై ప్రతి నెలా రూ.30,000-35,000 మధ్యలో ఆదాయం వస్తుంది. కనుక ఇది సరిపోదు. ఈ దృష్ట్యా మీరు ముందస్తుగా పదవీ విరమణ తీసుకోవాలన్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోండి. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేందుకు గాను.. ప్రతీ ఒక్కరు 35-40 శాతం నిధిని ఈక్విటీలకు కేటాయించుకోవడాన్ని పరిశీలించాలి. మిగిలిన నిధి నుంచి ఏడాది, ఏడాదిన్నర అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుని క్రమం తప్పకుండా పెట్టుబడుల ఉపసంహరణ (సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్/ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నిధిని అధిక నాణ్యత కలిగిన స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ విధమైన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకున్న తర్వాత.. ఏటా ఒక్కసారి ర్యీబ్యాలెన్స్ (మళ్లీ సమతుల్యం ఉండేలా చూసుకునేందుకు) చేసుకోవాలి. అంటే ఈక్విటీలకు 35 శాతం స్థాయిలో కేటాయింపులు ఉండేలా చూసుకుని.. అంతకుమించి ఉన్న నిధిని లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లిస్తూ ఎస్‌డబ్ల్యూపీని కొనసాగించుకోవాలి. దాంతో క్రమబద్ధమైన ఆదాయం అందుకోవచ్చు. అయినా సరే 7.5 శాతం ఉపసంహరణ రేటు అన్నది ఈ ప్రణాళికలోనూ సాధ్యం కాకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment