హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్.. ఇన్‌ఫినిటీ లెర్న్ పేరుతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కొత్త విభాగం కోసం సుమారు రూ.370 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఫౌండర్, చైర్మన్ బి.ఎస్.రావు వెల్లడించారు. అంతర్గత వనరుల నుంచే ఈ నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. ‘35 ఏళ్లుగా విద్యా బోధన అందిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఎడ్ టెక్ విభాగంలోకి ప్రవేశించడం సరైన సమయం. ఈ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదగాలన్నది మా లక్ష్యం. ఇందుకు మా వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయి. ఇన్‌ఫినిటీ లెర్న్ కంటెంట్ కోసం 100 మంది పరిశ్రమ నిపుణులు, సాంకేతిక సిబ్బందిని నియమించాం. నాణ్యతలో రాజీ పడకుండా కంటెంట్ కోసం ఇతర ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం’ అని వివరించారు.
మెరుగైన కంటెంట్
ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలోకి ఆలస్యంగా వస్తున్నప్పటికీ విద్యార్థులకు అవసరమయ్యే మెరుగైన కంటెంట్‌తో రంగ ప్రవేశం చేస్తున్నామని శ్రీ చైతన్య కో–ఫౌండర్ సుష్మ బొప్పన తెలిపారు. ఇండియాలో ఎడ్యుకేషన్ టెక్నాలజీకి అపారమైన అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బైజూస్, అన్ అకాడమీలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. తాజాగా శ్రీ చైతన్య విద్యాసంస్థ కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది.
చదవండి : అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల
Comments
Please login to add a commentAdd a comment