న్యూఢిల్లీ: మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం భారీగా దెబ్బతినడంతో ఆదాయం కూడా భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వలు పొదుపు చేసే క్రమంలో దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీటికోసం కూడా శ్రీలంక దిగుమతులపై ఆధారపడుతుంది.
ఇది ఇలా ఉంటే మరోపక్క ఆ దేశంలో చమురు నిల్వలు రోజు రోజుకి ఆడగంటి పోతున్నాయి. దీంతో ముడి చమురు కొనుగోళు చేయడానికి శ్రీలంక మనదేశాన్ని 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని సహాయాన్ని కోరింది. ఆ దేశంలో ప్రస్తుతం చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే దేశ అవసరాలకు సరిపోతాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్ పిలా హెచ్చరించిన కొన్ని రోజుల తర్వాత శ్రీలంక మన దేశాన్ని సహాయం చేయాలని కోరింది. ఆ దేశ ప్రభుత్వం నడుపుతున్న సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీ) రెండు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ సిలోన్, పీపుల్స్ బ్యాంకులకు దాదాపు 3.3 బిలియన్ డాలర్లు వరకు బకాయి పడింది.
(చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!)
దీంతో ఆ అప్పులను తీర్చడానికి ‘భారత్’ను సహాయం అర్దిస్తుంది. భారతదేశం, శ్రీలంక దేశాల ఇంధన కార్యదర్శులు త్వరలో రుణం కోసం ఒప్పందంపై సంతకం చేయాలని భావిస్తున్నారని ఆర్థిక కార్యదర్శి ఎస్ ఆర్ అట్టిగాల్లె పేర్కొన్నారు. గత వారం వంట గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇంధన రిటైల్ ధరల పెంపును నిలిపివేసింది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల వల్ల ఈ ఏడాది చమురు దిగుమతులపై ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో దేశ చమురు బిల్లు 41.5 శాతం పెరిగి 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment