
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 16,100 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 8 శాత వృద్ధితో రూ. 14,330 కోట్లను తాకింది. వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు కొంత మొత్తాన్ని కేటాయించడంతో లాభాల్లో వృద్ధి పరిమితమైంది. కాగా.. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా ఎగసి రూ. 39,500 కోట్లకు చేరింది.
అయితే డిపాజిట్ వ్యయాల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.43 శాతానికి చేరాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రొవిజన్లు రూ. 5,900 కోట్లమేర పెరగడంతో నిర్వహణ లాభం 8 శాతం క్షీణించి రూ. 19,417 కోట్లకు పరిమితమైనట్లు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) గత దశాబ్ద కాలంలోనే అతితక్కువగా 2.55 శాతాన్ని తాకాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 600 బ్రాంచీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఖారా తెలియజేశారు. ఎస్‌బీఐ ప్రస్తుతం 22,400 బ్రాంచీలను కలిగి ఉంది. కనీస మూలధన నిష్పత్తి 14.28 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment