ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయన్నారు. ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.., ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు(గురువారం) తేదీ ఉంది. అదే రోజున జూన్ ద్రవ్యలోటు, మే మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా, మరుసటి రోజున(జూలై 1న) ఆటో కంపెనీల జూన్ విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, కోవిడ్ కేసులు అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.
కమోడిటీ ధరలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూలతలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు కనిష్ట స్థాయి నుంచి రెండున్నర శాతం రికవరీ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 1,368 పాయింట్లు, నిఫ్టీ 406 చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 15,700 స్థాయి వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 15,900–16,250 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రెండ్ బేర్స్‌కు అనుకూలంగా మారితే దిగువస్థాయిలో 15,350 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు.
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు
► క్రూడాయిల్ కదలికలు
ఇటీవల గరిష్టాలకు(127.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్ ధర శుక్రవారం నాటికి 113.12 డాలర్లగా ఉంది. ‘‘ప్రస్తుతానికి క్రూడ్ ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రతికూలతలు సద్దుమణిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు తిరిగి పెరొగొచ్చు’’ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు
విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ జూన్‌లో రూ.46,000 కోట్లు, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి(జూన్ 24వ తేదీ నాటికి) వరకు రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఆర్‌బీఐ, ఫెడ్ రిజర్వ్‌లు కఠినతర ద్రవ్య విధాన అమలు తదితర అంశాలు ఎఫ్‌ఐఐల విక్రయాలకు కారమణని యస్ సెక్యూరిటీస్ ఇస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ జైన్ తెలిపారు.
గురువారం ఎఫ్ అండ్ ఓ ముగింపు
ఈ గురువారం(జూన్ 30న) నిఫ్టీ సూచీకి చెందిన జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు.
► శుక్రవారం ఆటో విక్రయ గణాంకాలు
దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం జూన్ నెల వాహన విక్రయాలు గణాంకాలను వెల్లడించనున్నాయి. ఆటో డేటా విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం, ఎస్కార్ట్స్ షేర్లు అధిక పరిమాణంలో ట్రేడయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడంతో గత వారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా ఏడు శాతం ర్యాలీ చేసింది. వార్షిక ప్రాతిపదికన ‘‘లో బేస్ ఎఫెక్ట్’’తో మెరుగైన గణాంకాలు నమోదు కావచ్చు.
► అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు
అమెరికా మే నెల గృహ అమ్మక గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఎల్లుండి యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ యూరోపియన్ యూనియన్ జూన్ పారిశ్రామిక, సేవా రంగ గణాంకాలు(జూన్ 29న) విడుదల అవుతాయి. అదే రోజున జపాన్ రిటైల్ విక్రయాలు వెల్లడి అవుతాయి. ఆ మరుసటి రోజున(జూన్ 30)న అమెరికా నిరుద్యోగ గణాంకాల డేటా వెల్లడి అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.
మార్కెట్లో ఒడిదుడుకులే..?
Published Mon, Jun 27 2022 6:04 AM | Last Updated on Mon, Jun 27 2022 6:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment