
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం (56,433) నుంచి 663 పాయింట్లు క్షీణించి చివరికి 49 పాయింట్ల నష్టంతో 55,769 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 166 పాయింట్లు బలపడింది. మార్కెట్ ముగిసే సరికి 44 పాయింట్ల నష్టంతో 16,584 వద్ద నిలిచింది. ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి.
ఆటో రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. విస్తృతస్థాయి మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,770 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.2,360 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి మూడు పైసలు క్షీణించి 77.63 వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, ద్రవ్య విధానాన్ని నిర్ణయించే యూఎస్ ఉద్యోగ గణాంకాల వెల్లడి(శుక్రవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ ఈ వారంలో మూడు ట్రేడింగ్ సెషన్‌లో నష్టాలను చవిచూడగా, రెండురోజులు లాభాలను ఆర్జించింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ల్లో సెన్సెక్స్ 885 పాయింట్లు, నిఫ్టీ 232 పాయింట్లు చొప్పున పెరిగాయి. ‘‘వచ్చే వారంలో(6–8 తేదిల్లో) ఆర్‌బీఐ.., అటుపై వారం (14–15 తేదీల్లో) యూఎస్ ఫెడ్ రిజర్వ్ పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ 25–35 బేసిస్ పాయింట్లు., ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్లు చొప్పున వడ్డీరేట్లను పెంచే వీలుంది. పాలసీ ప్రకటన సందర్భంగా వెల్లడయ్యే ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్ వ్యాఖ్యలు, ద్రవ్యోల్బణ అంశాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయి. అలాగే ద్రవ్య పాలసీపై కేంద్ర బ్యాంకులు మునుపటి కన్నా కఠిన వైఖరిని ప్రదర్శిస్తే ఈక్విటీ మార్కెట్లలో తిరిగి బేరీష్ వాతావరణం నెలకొనవచ్చు’’ జియోజిత్ పైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్
స్పెషాలిటీ కెమికల్స్ ఏథర్ ఇండస్ట్రీస్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.642తో పోలిస్తే పదిశాతం లాభంతో రూ.706 వద్ద లిస్టయింది. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 21 శాతం దూసుకెళ్లి అప్పర్ సర్క్యూట్ రూ.777 వద్ద లాకయ్యింది. ఎక్సే్ఛంజీలో మొత్తం 5.71 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.9,669 కోట్లుగా నమోదైంది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రెండోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్‌ఈలో రెండు శాతం లాభపడి రూ. 2,779.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3% శాతం బలపడి రూ.2,816 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు ఏడుశాతం పెరిగింది.
అల్ట్రాటెక్ సిమెంట్ రూ.12,886 కోట్ల సామర్థ్య విస్తరణ ప్రణాళిక ప్రకటనతో సిమెంట్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక సరఫరాతో సిమెంట్ ధరలు దిగివస్తాయనే ఆందోళనలతో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, శ్రీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, నువాకో విస్టాస్, గ్రాసీమ్ షేర్లు 6% పతనాన్ని చవిచూశాయి.
గుజరాత్ యూనిట్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో దీపక్ నైట్రేట్ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.1,964 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment