
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్ రెండోరోజూ నష్టాలను చవిచూసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇంట్రాడేలో 642 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 85 పాయింట్ల నష్టంతో 56,976 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. మార్కెట్ ముగిసే సరికి 33 పాయింట్ల పతనంతో 17,069 వద్ద నిలిచింది.
ఐటీ, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్స్, వినిమయ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అరశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,872 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,981 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభ లాభాల్ని కోల్పోయి ఒక పైసా స్వల్ప నష్టంతో 76.51 స్థాయి వద్ద స్థిరపడింది.
ఆసియాలో చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, తైవాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో సెలవు కావడంతో ఆయా దేశాల ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. అయితే జపాన్, దక్షిణ కొరియాల స్టాక్ సూచీలు అరశాతం నష్టపోయాయి. యూరప్‌లో లండన్ మార్కెట్‌కు సెలవు కాగా.., ఫ్రాన్స్, జర్మనీ దేశాల ఇండెక్సులు రెండు శాతం క్షీణించాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశానికి ముందు(నేడు) అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. రంజాన్ సందర్భంగా మంగళవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు ఉదయం సెషన్‌లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.
‘‘ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ కఠిన విధాన వైఖరికి మొగ్గుచూపొచ్చనే ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు తొలి దశలో అమ్మకాలకు పాల్పడ్డారు. డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, కమోడిటీ ధరల్లో అస్థిరతలు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యాన్ని తగ్గించాయి. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందనేందుకు సంకేతంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడటంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెచ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఆరంభ నష్టాలు రికవరీ
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలతో ఉదయం దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 632 పాయింట్ల నష్టంతో 56,429 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 16,924 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో సెన్సెక్స్ 648 పాయింట్ల క్షీణించి 56,413 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 185 పాయింట్లు దిగివచ్చి 16,917 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిలను నమోదు చేసింది. అయితే ఏప్రిల్ జీఎస్‌టీ వసూళ్లు జీవితకాల గరిష్ట స్థాయిలో నమోదవడంతో పాటు ఇదే నెలలో ఆటో అమ్మకాలు, దేశీయ తయారీ రంగం పటిష్ట వృద్ధి రేటును కనబరచడం తదితర సానుకూలాంశాల అండతో సూచీలు ఆరంభ నష్టాలను రికవరీ చేసుకోగలిగాయి. ముఖ్యంగా మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలియి.
Comments
Please login to add a commentAdd a comment