ముంబై: ఆర్థిక మాంద్యం భయాలు మరోసారి తెరపైకి రావడంతో స్టాక్ సూచీల నాలుగు రోజుల లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. జూన్ నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ(నేడు)కి ముందుట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఐటీ ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన అంతర్జాతీయ సంకేతాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 53,027 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్ల పతనంతో 15,799 వద్ద నిలిచింది. మరోవైపు ఇంధన, రియల్టీ, మెటల్, ఆటో షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు వరసగా 0.70%, 0.20 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.847 కోట్ల షేర్లను కొన్నారు. యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు విడుదల(రాత్రికి) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
‘‘ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా ఇటీలవ దేశీయ స్టాక్ మార్కెట్ సరైన దిశా, నిర్దేశం లేకుండా ట్రేడ్ అవుతోంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ(నేడు)తో పాటు ఆటో విక్రయ, పీఎంఐ గణాంకాల విడుదల(రేపు)కు ముందు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రానున్న రోజుల్లో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు.
మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్లు
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 554 పాయింట్ల నష్టంతో 52,623 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు పతనంతో 15,702 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కొనుగోళ్లకు తోడ్పడే అంశాలేవీలేకపోవడంతో సూచీలు తొలిసెషన్‌లో పరిమితి శ్రేణిలో నష్టాలతో కదలాడాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి ఇంధన, ఆటో ప్రభుత్వ కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడాయిల్ విక్రయం ధరలను నియంత్రణ పరిధి నుంచి తొలిగించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయంతో ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు ఐదుశాతం నుంచి ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి.
► ఓపెన్ మార్కెట్ పద్దతిలో షేర్ల బైబ్యాక్ ప్రకటన నిరాశపరచడంతో రూట్ మొబైల్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.1,237 వద్ద నిలిచింది.
►ఆర్‌బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లు 4శాతం నుంచి ఒకశాతం క్షీణించాయి.
కారణాలు...కఠినం
క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెంపు ధోరణి, డాలర్ పటిష్టత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు, మరో మాంద్యం ముందు ప్రపంచం నిలబడిందన్న విశ్లేషణలు, కోవిడ్–19పై అనిశ్చితి వంటి పలు అంశాలు రూపాయి పతనానికి కారణంగా ఉన్నాయి. మరోవైపు రూపాయి కట్టడిచేసే స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లేదన్న వార్తలు రూపాయి జారుడుకు మరింత ఊతం ఇస్తోంది. ఇటీవల ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్‌బీఐ నిర్ధేశించుకోలేదని చెప్పారు.
‘‘రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్‌బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 79 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.50 డాలర్లపైన ట్రేడవుతోంది.
ముంబై: క్షీణబాటలో రూపాయి వేగం ఆగట్లేదు. ఏరోజుకారోజు కొత్త పతన రికార్డులు కొనసాగుతున్నాయి. బుధవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోల్చితే 18 పైసలు నష్టంతో 79.03 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మంగళవారం ముగింపు 78.85. బుధవారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 78.86 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒక దశలో 79.05 స్థాయినీ చూసింది. చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 18పైసలు నష్టపోయింది. వెరసి ముగింపు, ఇంట్రాడేల్లో రూపాయిది బుధవారం విలువలే కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రూపాయి దాదాపు 6 శాతం నష్టపోయింది. ఏడాది ప్రారంభం నుంచి 6.39 శాతం నష్టపోతే, ఒక్క జూన్ నెల్లో 2 శాతం పతనమైంది. ఫిలిప్పీన్ పెసో, థాయ్ భాట్ తర్వాత ఆసియా కరెన్సీల్లో రూపాయి ఇటీవలి నెలల్లో మూడవ అత్యంత క్షీణతను నమోదుచేసుకుంది. శుక్రవారం వరుసగా ఎనిమిది వారాల్లో నష్టాల్లో నడిచిన రూపాయి, తాజా వారంలో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టపోవడం గమనార్హం.
ఐపీవోకు ఇన్నోవా క్యాప్‌ట్యాబ్
ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment