మార్కెట్ ఇప్పటికే ఆల్‌టైమ్‌హైలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి పెరుగుతుందా.. ఫెడ్ కీలక వడ్డీరేట్లు తగ్గించనుందనే సంకేతాలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. వచ్చేవారం మార్కెట్ వైఖరి ఎలా ఉండబోతుంది.. వంటి అంశాలపై ప్రముఖ స్టాక్‌మార్కెట్ అనలిస్ట్ కారుణ్యరావు మాట్లాడారు.
మార్కెట్ ఆల్‌టైమ్‌హైను చేరింది. దాంతో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతారు. కానీ చాలా కాలంగా మార్కెట్‌లో ఉంటున్నవారు అంతగా కంగారుపడి ఇక్కడి నుంచి మార్కెట్ తగ్గుతుందేమోనని స్టాక్‌లను విక్రయించే ప్రయత్నం చేయరు. అయితే నిజంగా మార్కెట్ ఇంతలా పెరిగినపుడు కొంత కరెక్షన్ రావొచ్చు. కానీ గతంలోలాగా చాలా తగ్గిపోతుందనే సంకేతాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. నిజంగా మార్కెట్లు తగ్గుతాయనే లాజిక్ ఉంటే కొనుగోలు, విక్రయంపై నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా, సరైన కారణం లేకుండా మార్కెట్‌లో పొజిషన్ తీసుకోవడంతో నష్టపోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది మార్కెట్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ దాదాపు 18 శాతం పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 2024లో మార్కెట్లు కొంత కన్సాలిడేషన్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా జనవరిలో మార్కెట్‌లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈసారి నష్టాల్లో కాకుండా లాభాల్లోకి మారుతాయానే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితులు లేకపోవడం, దేశీయ మార్కెట్‌లో సానుకూలత వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలుస్తుంది.
ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీరేట్లు తగ్గుస్తుందనే సంకేతాలు ప్రధానంగా ఐటీ కంపెనీలకు బలం చేకూర్చాయి. దాంతో ఐటీ స్టాక్‌ల్లో భారీగా ర్యాలీ కనిపిస్తోంది. ఇది మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈసారి కూడా కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఊహించిన ఫలితాలు ప్రకటించకపోవచ్చు. దాంతో కంగారుపడి మంచి కంపెనీ స్టాక్‌లు అమ్మేయకుండా పడిన ప్రతిసారి ఎస్‌ఐపీ విధానంలో కొంతమేర కొనుగోలు చేయాలి.
కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. అధిక వాల్యుయేషన్లు, ఎల్‌నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment