
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే ఈ వారంలో స్టాక్ సూచీలు సానుకూలంగా కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా, ఎఫ్‌ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు, తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం స్టాక్ ఎక్సే్చంజీలకు సెలవు.
ఆర్‌బీఐ పరపతి విధానం సానుకూలంగా ఉండటంతో గతవారంలో సూచీలు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఆటో, ఫార్మా, మౌలిక షేర్ల మద్దతుతో సెన్సెక్స్ 841 పాయింట్లు, నిఫ్టీ 239 పాయింట్లు లాభపడ్డాయి. మహవీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కావడంతో గతవారం ట్రేడింగ్ మూడురోజులే జరిగిన సంగతి తెలిసిందే.
‘‘రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడంతో గతవారం సూచీలు కీలక సాంకేతిక స్థాయిలను అధిగమించగలిగాయి. డాలర్ ఇండెక్స్ పతనమైంది. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గింది. దేశీయ మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ రెండేళ్ల కనిష్టం 11.80స్థాయికి దిగివచ్చింది. ఇవి బుల్స్‌కు మరింత ఉత్సాహానిచ్చే అంశాలుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు సద్దుమణుగుతున్న వేళ .., మార్కెట్ వర్గాలు కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలపై దృష్టి సారించారు. అనుకున్నట్లే కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో కీలకమైన 17,600 – 17,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,300 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.
ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభం
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ బుధవారం (ఏప్రిల్ 12న) క్యూ4 క్వార్టర్ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. మరో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆ మరుసటి రోజు(గురువారం) గణాంకాలను ప్రకటించనుంది. యూరప్, యూఎస్‌లో నెలకొన్న మందగమనం, ఆర్థిక అస్థిరతల దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాఫ్టేవేర్ దిగ్గజ కంపెనీల ఆదాయ అంచనాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల యాజమాన్య అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది. ఇదే వారంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డెల్టా కార్ప్‌లు ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి.
స్థూల ఆర్థిక గణాంకాలు
ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటా, మార్చి సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం(ఏప్రిల్ 12న) విడుదల కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం మార్చి నెల డబ్ల్యూపీ ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా వెల్లడి కానుంది. అదేరోజున ఆర్‌బీఐ ఏప్రిల్ ఏడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. అంతర్జాతీయంగా సోమ వారం జపాన్ కరెంట్ అకౌంట్, వినియోగదారుల విశ్వాసం గణాంకాలు, మంగళవారం యూఎస్ రిటైల్ అమ్మకాలు, చైనా ద్రవ్యోల్బణ డేటా వెల్లడికాన్నాయి.
విదేశీ ఇన్వెస్టర్ల యూ టర్న్...
గడచిన నెలల్లో విక్రయాలకు పాల్పడిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో కొనుగోళ్లకు ఆస్తకి చూపుతున్నారు. ఈ ఏప్రిల్ మొదటి వారంలో రూ.1,600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పతనంతో ఎఫ్‌ఐఐలు ఈక్విటీల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ కరెన్సీ రూపాయి సైతం 82.75 – 81.74 శ్రేణిలో కదలాడటం కలిస్తోంది. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని నిపుణులు చెబుతున్నారు.