వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో ఒడుదొడుకులకు లోనయిన స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటాయా? లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ ఎలా ఉండబోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరల ప్రభావం మార్కెట్‌పై ఏమేరకు ఉంటుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్‌పై ఎలా ఉండబోతాయనే వివరాలపై ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు.
ఎట్టకేలకు నిఫ్టీ జీవితకాల గరిష్టానికి చేరింది. నిఫ్టీ ఇండెక్స్ గతంలో సెప్టెంబర్ 15న ఆల్ టైమ్ హైని తాకింది. సగటు కంటే ఎక్కువ వాల్యూమ్‌లతో డిసెంబర్ 1న తాజా రికార్డు నెలకొంది. వచ్చే వారంలో కొంత ఒడుదొడుకులు ఎదురైనా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇండెక్స్ 20,000 నుంచి 19,800 మధ్య కదలాడే అవకాశం ఉంది. కానీ రాబోయేరోజుల్లో 20,500 మార్కును చేరుతుందని తెలుస్తోంది. నిఫ్టీ శుక్రవారం 20,194 వద్ద అధిక ప్రారంభమైంది. రోజు గడిచేకొద్దీ వేగంగా పుంజుకుంది. మధ్యాహ్నం 20,292 వద్ద తాజా రికార్డును తాకింది.
వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ50 బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్‌ను ఏర్పరిచింది. ఈ వారంలో 2.4 శాతం లాభపడింది. ఇది ఈ సంవత్సరం జూన్ తర్వాత వారాల వారీగా అధికలాభంగా ఉంది. నిఫ్టీ ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతుంది. రాబోయే వారంలో మరింత పైకి ఎగబాకవచ్చు. 2023లో ఇప్పటివరకు నిఫ్టీ 50 దాదాపు 11 శాతం పెరిగింది. మెరుగైన ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఆదాయాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఇన్‌ఫ్లోలు (మార్చి-ఆగస్టు 23), రిటైల్ భాగస్వామ్యం మార్కెట్‌ను లాభాల్లో నడిపిస్తున్నాయి.
తాజాగా ఆర్‌బీఐ భారతదేశ జీడీపీ వృద్ధి సూచీను ప్రకటించింది. ముందుగా 6.5-7 శాతం ఉంటుందని భావించిన వృద్ధి.. 7.6 శాతానికి చేరడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దాంతోపాటు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో మరింత పుంజుకునే వీలుంటుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో భాజాపా అధికారంలోకి రాబోతుందనే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో మార్కెట్ సూచీలు మరింత జోష్ అందుకున్నాయి. రాజస్థాన్‌లో కొన్నేళ్లుగా ప్రతిసారి వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. దాంతో ఈసారి భాజపా గెలువబోతుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. స్పష్టమైన ప్రభుత్వం వస్తే మార్కెట్లు మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది.
ఇటీవల లిస్ట్ అయిన ఐదు ఐపీఓలు మంచి లాభాలు అందుకున్నాయి. అయితే ఐపీఓ దక్కని ఇన్వెస్టర్ల డబ్బు దాదాపు రూ.2.5 లక్షల కోట్లు అందులో ఉండిపోయింది. మదుపరులకు వెనక్కి వచ్చిన సొమ్మును కొందరు తిరిగి మార్కెట్‌లోనే పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. దాంతో తిరిగి నిఫ్టీలో మంచి ర్యాలీ కనిపించనుందని తెలుస్తోంది. గత కొన్ని నెలల్లో గ్లోబల్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో బాండ్‌ఈల్డ్‌లు తగ్గుముఖం పట్టాయి.
బ్యాంకింగ్, ఆటో, హెల్త్‌కేర్, కొన్ని లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్‌లు మంచి వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. మే 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు మార్కెట్‌లో ర్యాలీకి అనుకూలంగా ఉంది. గత ఐదు వరుస లోక్‌సభ ఎన్నికల (1999 నుండి 2019 వరకు) ఫలితాలు ప్రకటించే వరకు (నవంబర్-మే) ఆరు నెలల వ్యవధిలో నిఫ్టీ 10-35 శాతం ర్యాలీ అయినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ సమస్యలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment