దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 281 పాయింట్లు పెరిగి 24,329కు చేరింది. సెన్సెక్స్ 937 పాయింట్లు పుంజుకుని 79,734 వద్ద ట్రేడవుతోంది. సోమవారం భారీగా తగ్గిన మార్కెట్లు మంగళవారం లాభాల్లోకి చేరుకున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 102.87 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 77.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.78 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 3 శాతం, నాస్‌డాక్ 3.4 శాతం నష్టపోయాయి.
అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం.
అమెరికా జాబ్స్‌డేటా ప్రకారం జులైలో నియామకాల ప్రక్రియ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జులైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కీలకంగా మారింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment