దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు నష్టపోయి 23,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 16 పాయింట్లు ఎగబాకి 76,663 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 109.19 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్(Crude Oil) ధర 80.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.51 శాతం ఎగబాకింది.
క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.
ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment